Take a fresh look at your lifestyle.

ఉద్యోగుల సహనాన్ని పరీక్షించ వద్దు ..!

Amendment Commission Recommendations (PRC)

  • సర్కారు, యూనియన్ల తీరు మారాలి : సత్వరం వేతన సవరణ చేయాలి

రాష్ట్రప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారథిగా ఉంటూ పాలనా బాధ్యతలు నిర్వహిస్తున్న సర్కారు ఉద్యోగులు కొత్త వేతన సవరణ కమిషన్‌ ‌సిఫారసుల (పీఆర్సీ) అమలు కోసం కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. పదవ పీఆర్సీ కాలపరిమితి 2018 జూన్‌ 30‌తోనే ముగిసిపోయింది. 2018 జులై 1 నుంచి ఉద్యోగులకు వేతన సవరణ చేయాల్సి ఉంది. మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల ధరల సూచి ఆధారంగా ఉద్యోగులకు వేతన పెంపును ఖరారు చేస్తారు. ఇందుకోసం సీఆర్‌ ‌బిస్వాల్‌ ‌చైర్మన్‌గా ఉమామహేశ్వర్‌ ‌రావు, మహ్మద్‌ అలీ రఫత్‌ ‌సభ్యులుగా 2018 మే 18న 11వ పీఆర్సీని ప్రభుత్వం వేసింది. వేతన సవరణతోపాటు సర్వీసు రూల్స్ ‌సరళీకరణ తదితర అంశాలపై సమగ్రంగా అధ్యయనం జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. కానీ ప్రభుత్వం కమిషన్‌ ‌కాలపరిమితి పెంచుతూ నేటికి కూడా పీఆర్‌సీని అమలు చేయకుండా కాలం వెల్లదీస్తున్నది. ఎన్నికల కోడ్‌, ఆర్థిక మాంద్యం అంటూ మీనమేషాలు లెక్కిస్తున్నది. ఫ్రెండ్లీ గవర్నమెంట్‌ అం‌టే ఇదేనా అని ఉద్యోగ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ముఖ్యమంత్రి అనేకసార్లు ప్రెస్‌మీట్‌లలో జీతాలు తప్పక పెంచుతామని అంటూ ఉద్యోగుల్లో ఆశలురేపారు కానీ నెరవేర్చడం లేదు. పొరుగురాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ ‌సర్కారు ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే అయినప్పటికీ అక్కడి ఉద్యోగులకు ఐఆర్‌ ‌ప్రకటించి మెరుగైన వేతనాలు ఇస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రమని, అభివృద్ధిపథంలో దూసుకుపోతున్నదని మన సీఎం మాటిమాటికీ చెప్త్తుంటారు. కానీ ఉద్యోగుల సమస్యలను మాత్రం విస్మరిస్తున్నారు. ఈ వైఖరి ఉద్యోగులను తీవ్ర నిరాశా నిస్పహలకు గురిచేస్తున్నది. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు ప్రధాన పాత్ర పోషించారన్న విషయాన్ని ప్రభుత్వం మరిచి పోయినట్లున్నది. తెలంగాణ రాష్ట్రం వస్తే సర్కారు ఉద్యోగులు కూడా బాగుపడుతారన్నది సత్యదూరమనిపిస్తున్నది.

30 ఏండ్ల సర్వీసున్నా కనీసం సొంత ఇల్లు కూడా లేని దయనీయ స్థితిలో ఎంతోమంది ఉద్యోగులున్నారనే వాస్తవాన్ని ప్రభుత్వం గ్రహించాలి.అటు ప్రభుత్వం ఉద్యమ బాటపట్టిన ఉద్యోగులను అణచివేస్తున్నది.ఆర్టీసీ ఉద్యోగుల ఉదంతం ఇందుకు ఉదాహరణ. ఏవో కొన్ని శాఖలు, కొందరు ఉద్యోగ సంఘ నాయకుల పరిస్థితి మెరుగుగా ఉండవచ్చు. అంతమాత్రాన వారిని చూసి ఉద్యోగులందరిని ఒకే గాటన కట్టిచూడరాదు. పెరిగిన ధరలు, ఖర్చులను తట్టుకోలేక గతంలో చేసిన ఋణాలు తీర్చలేక ఎందరో ఉద్యోగులు ఇబ్బందిపడుతున్నారు.ఉద్యోగులందరి సమస్యలు తీరుస్తామని గొప్పలు చెప్పి సొంతపనులు, పదవుల వ్యామోహంలో పడిన కొందరు యూనియన్‌ ‌నాయకులపై సగటు ఉద్యోగులు మండిపడుతున్నారు. ఈ నాయకులు ముఖ్యమంత్రిని కలిసి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేసిన దాఖలాలు లేవు. ఇప్పటికైనా సంఘాలన్ని తమ నాయకత్వం కోసం కాకుండా వెంటనే ఉద్యోగ వర్గాల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం కార్యాచరణకు పూనుకోవాలి. గతంలో పోరాడి సాధించుకున్న హక్కులను, సౌకర్యాలను నేటి పాలకుల, ఉద్యోగసంఘాల నాయకుల నిర్లక్ష్యం మూలంగా కోల్పోవలసి వస్తున్నదని ఉద్యోగులు బాధపడుతున్నారు. మరో పక్క సర్కారు వైఖరి కూడా సబబుగా లేదు. తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని సర్కారు అంటున్నది. నిజానికి సగటు ఉద్యోగులు అట్లా లేరు. పైగా ప్రభుత్వ పెద్దలు కొన్ని సందర్భాల్లో ఉద్యోగులలను ప్రజలనుంచి వేరుచేసి తక్కువ చేసి మాట్లాడుతూ, అవినీతి పరులుగా చిత్రీకరిస్తున్నారు. ఈ వైఖరి పాలకులకు క్షేమంకాదు. 1958 నుండి నేటి వరకు 211 నెలలు అంటే సుమారు 3 పి.ఆర్‌.‌సి.లకు పైగా ఆర్థిక పరమైన నష్టాన్ని ఉద్యోగులు భరిస్తున్నారన్న వాస్తవాన్ని ప్రభుత్వం కాదనగలదా.. ఉద్యోగులు యాచకులు కాదు, ప్రభుత్వ నిర్ణయాలను ప్రజల చెంతకు చేర్చే ప్రగతి ప్రదాతలని గమనించాలి. రాష్ట్రం ఏర్పడ్డ నాటినుండి ఉద్యోగులు ప్రభుత్వం నిర్దేశించిన ప్రతి కార్యక్రమాన్ని భుజాన వేసుకొని అమలు చేస్తున్నారు. ఏ వ్యవస్థలోనైనా కొంతమంది అవినీతితోనో బాధ్యత రాహిత్యంతోనో ఉంటారు.

వారిని కట్టడి చేయాల్సిన బాధ్యత సర్కారుదే.. అంతేతప్ప వారిని చూపి అందరినీ బదనాం చేయడం భావ్యంకాదు. ఇప్పటికే చాలా ఆలస్యమైనంది. ఉద్యోగుల వెతలను చూసి ముఖ్యమంత్రి వెంటనే పీఆర్సీ నివేదిక తెప్పించుకొని ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి సత్వరమే పీఆర్సీ అమలుకు పూనుకోవాలి. ఉద్యోగ సంఘాల నేతల తీరు మారాలి. ఉద్యోగవర్గాల సహనాన్ని ఇంకా పరీక్షించ వద్దు..

-మేకిరి దామోదర్‌
‌వరంగల్‌
9573666650

Leave a Reply