వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

‘ఉత్త’మ అధికారులకేమైంది..? అవినీతి పరులకే సేవా పతకాలా?

August 23, 2019

ఫోటో:  ‌దుబ్బాకలో బాచుపల్లి ఎసిబికి పట్టుబడిన తహశీల్దార్‌ ‌వై.గిరి సోదరి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న ఎసిబి అధికారులు(పాత చిత్రం)
ఫోటో: ‌దుబ్బాకలో బాచుపల్లి ఎసిబికి పట్టుబడిన తహశీల్దార్‌ ‌వై.గిరి సోదరి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న ఎసిబి అధికారులు(పాత చిత్రం)

ప్రజాప్రతినిధుల అండతోనే …
రూ.93 లక్షల నగదుతో దొరికిన లావణ్య
ప్రశంసా పత్రాన్ని తీసుకున్న మరుసటి రోజే పట్టుబడిన పోలీస్‌ ‌తిరుపతిరెడ్డి
తాజాగా…ఎన్‌వై గిరి
ప్రభుత్వం చేత ఉత్తమ అధికారులుగా ప్రశంసా పత్రాలను పొందిన వారు వరుసగా ఒక్కొక్కరు అవినీతి శాఖ అధికారులకు పట్టుబడుతున్నారు. ఇటీవలి కాలంలో లంచాలు తీసుకుంటూ ఎసిబి అధికారులకు చిక్కిన వారిలో అధికులు ఉత్తమ అధికారులే ఉండటం గమనార్హం. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ శాఖల్లోని అధికారులు, సిబ్బందిని ఈ వరుస ఎసిబి దాడులు ఒకింత టెన్షన్‌కు గురి చేస్తున్నాయి. అంతేకాదు, రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ఉన్న అభిప్రాయానికి రెవెన్యూ అధికారులు ఎసిబికి పట్టుబడుతుండటం లెక్క కుదిరినట్లవుతుంది. ఇదిలా ఉంటే, తెలంగాణను అవినీతి రహిత రాష్ట్రంగా ముఖ్యంగా రెవెన్యూ శాఖలో పేరుకుపోయిన అవినీతిని పూర్తిగా రూపుమాపాలన్న గట్టి సంకల్పంతో సిఎం కేసీఆర్‌ ఉన్నారు. అవినీతిమయంగా మారిన రెవెన్యూ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేసే దిశగా కేసీఆర్‌ ‌జిల్లాల కలెక్టర్లతో వరుస సమావేశాలు జరుపుతున్నారు. రెవెన్యూ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు కొత్త చట్టాన్ని తెచ్చే పనిలో నిమగ్నమై ఉన్నారు. అవినీతి నిర్మూలననే లక్ష్యంగా కేసీఆర్‌ ‌వడివడిగా ఓ వైపు అడుగులు వేస్తుంటే…మరోవైపు రెవెన్యూ శాఖకు చెందిన అధికారులు మాత్రం లంచాలకు మరిగారు. డబ్బులు ఇవ్వందే ఫైల్‌ ‌ముందుకు కదిలేది లేదంటూ భీష్మించుకుని కూర్చుంటున్నారు. ఫలితంగా లంచం డబ్బులు తీసుకుంటూ…ఏకంగా అవినీతి శాఖ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడుతున్నారు. వరుసగా అధికారులు ఎసిబికి దొరుకుతుండటం రెవెన్యూ శాఖలో కలకలం రేపుతున్నది. ఇప్పుడు రెవెన్యూ శాఖలో ఇదే హాట్‌ ‌టాపిక్‌. అయితే,
ఎసిబి అధికారులకు పట్టుబడుతున్న వారందరూ ఉత్తమ సేవా పతకాలను తీసుకున్న వారే కావడం విశేషం. మొన్నటికి మొన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని కేశంపేట తహశీల్దార్‌ ‌లావణ్య ఎసిబి అధికారులకు చిక్కారు. ఆమె ఇంట్లో సోదాలు చేస్తే లక్షల రూపాయల కట్టలు దొరికాయి. ఆ తర్వాత మహబూబ్‌నగర్‌ ‌జిల్లా వన్‌టౌన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పల్లె తిరుపతిరెడ్డి అవినీతి అధికారులకు దొరికాడు. ఉత్తమ సేవలను అందించినందుకు గానూ తిరుపతిరెడ్డి ఈ నెల 15న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ‌నుంచి ఉత్తమ సేవా ప్రశంసా పత్రాన్ని తీసుకున్న 24గంటల వ్యవధిలోనే ఓ కేసు విషయమై డబ్బులు తీసుకుంటూ ఎసిబి అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. తాజాగా…బాచుపల్లి తహశీల్దార్‌ ‌నిమ్మ యాదగిరి అలియాస్‌ ఎన్‌.‌వై.గిరి ఎసిబి అధికారులకు చిక్కాడు. ఎసిబికి చిక్కిన లావణ్య, పల్లె తిరుపతిరెడ్డి, యాదగిరి మూగ్గురూ ఉత్తమ ప్రశంసా పత్రాలను తీసుకున్న ఉత్తమ అధికారులు కావడం మరో విశేషం.
రెవెన్యూ శాఖను కుదుపేస్తున్న అవినీతి తిమింగలాలు?
ఎమ్మెల్యే స్థాయి నుంచి వచ్చిన సిఎం కేసీఆర్‌కు రెవెన్యూ శాఖ పుట్టుపూర్వోత్తాలు పూర్తిగా తెలుసు. రెవెన్యూ శాఖలో అవినీతి ఏ విధంగా ఉంటుందో ఆయనకు తెలిసే.. రెవెన్యూ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు సిద్ధమయ్యారు. రెవెన్యూ శాఖలోని విఆర్వో వ్యవస్థను పూర్తిగా తొలగించే పనిలో సిఎం కేసీఆర్‌ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతోనే రెవెన్యూ శాఖ అసోసియేషన్‌ ‌రెవెన్యూ శాఖను ముట్టుకోవద్దంటూ ఒకింత ఆందోళనలు చేస్తున్నారు. ఉన్నతాధికారులకు వినతి పత్రాలు ఇస్తున్నారు. నిరసనలు చేస్తున్నారు. అయినప్పటికీ…సిఎం కేసీఆర్‌ ‌మాత్రం ఒక అడుగు కూడా వెనక్కి వేసేట్లు అగుపించడం లేదు. దీనికి తోడుగా ఎసిబికి చిక్కుతున్న వారిలో ఎక్కువగా రెవెన్యూ శాఖకు చెందిన వారే కావడంతో ఈ వ్యవహారం ఇప్పుడు రెవెన్యూ శాఖను ఒక కుదుపు కుదుపేస్తున్నది. రెవెన్యూ ప్రక్షాళన చేయకుండా ఉండేందుకు రెవెన్యూ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై వొత్తిడి తెచ్చే ప్రయత్నంలో ఉండగా…మరోవైపు అదే శాఖకు చెందిన అధికారులు డబ్బులు తీసుకుంటూ ఎసిబికి చిక్కుతుండటంతో రెవెన్యూ ఉద్యోగ సంఘాలకు ఏం చేయాలో తెలియని దిక్చుతోచని స్థితిలో ఉన్నారు. మొత్తంగా అవినీతి తిమింగలాలతో రెవెన్యూ శాఖను కుదుపేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ప్రజాప్రతినిధులను మచ్చిక చేసుకుంటూ…?
తాజాగా…అవినీతి అధికారులకు చిక్కిన బాచుపల్లి తహశీల్దార్‌ ‌యాదగిరి కూడా అనేక పర్యాయాలు ఉత్తమ అవార్డును తీసుకున్న అధికారే. ఉమ్మడి మెదక్‌ ‌జిల్లాతో పాటు, కొత్తగా జిల్లాలు ఏర్పాటైన తర్వాత సిద్ధిపేట, సంగారెడ్డి జిల్లాలో పని చేసిన యాదగిరి దాదాపుగా ప్రతి పంద్రాగస్టుకు ఉత్తమ అవార్డును తీసుకున్నట్లు రెవెన్యూ వర్గాలు ఇక్కడ ‘ప్రజాతంత్ర’కు తెలిపాయి. సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలో పని చేసిన యాదగిరి అనేకమార్లు ఉత్తమ అవార్డును తీసుకున్నప్పటికీ…ఆయనపై అదేస్థాయిలోనూ అవినీతి ఆరోపణలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎసిబికి పట్టుబడిన యాదగిరి…నేడు ఎంతో ఉన్నతస్థాయికి ఎదగడానికి కారణం ఆయన పని చేసే ప్రతిచోటా ప్రజాప్రతినిధులను మచ్చిక చేసుకోవడమేననీ రెవెన్యూ శాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు. ఎమ్మెల్యే స్థాయి ప్రజాప్రతినిధిని సైతం యాదగిరి తన రూట్‌లోకి తెచ్చుకునే వాక్చాతుర్యం ఆయన సొంతంగా తెలుస్తున్నది. దీంతో యాదగిరికి కూడా సంబంధిత ప్రజాప్రతినిధులు కూడా ఎనలేని స్వేచ్ఛను ఇచ్చే వారనీ తెలుస్తుంది. ఫలితంగా యాదగిరి ఎవరూ ఊహంచని స్థాయికి ఎదిగినట్లు రెవెన్యూ శాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రజాప్రతినిధులతో యాదగిరికి ఉన్న చనువు చూసి జిల్లాస్థాయి అధికారులు, కిందిస్తాయి సిబ్బంది సైతం ఒక్కోసారి ఆశ్చర్యానికి గురయ్యేవారనీ తెలుస్తుంది. యాదగిరికి ప్రజాప్రతినిధులతో ఉన్న అనుబంధంతో ఆయనను ఎవరూ ఏమీ అనేవారు కాదనీ సమాచారం. దీంతోనే యాదగిరి తను చెప్పిందే లెక్క. తను చేసేదే సంతకం. తను చెప్పేదే ఫైనల్‌గా మారి… తనకు తోచినట్లు అడ్డూ అదుపులేకుండా రెచ్చిపోయినట్లు తెలుస్తుంది. అనేకమార్లు ఉత్తమ అవార్డుకు ఎంపికైన తహశీల్దార్‌ ‌యాదగిరి చివరకు అవినీతి అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడటం అందరికీ బాధ కలిగిస్తున్నది. అవినీతి ఆరోపణలున్న వారికి ఉత్తమ ప్రశంసా పత్రాలను ఇవ్వడంపై కూడా సర్వత్రా విమర్శలు వినవస్తున్నాయి. ఏది ఏమైనా వరుసగా అవినీతి శాఖాధికారులకు ఉత్తమ అవార్డు పొందినవారే పట్టుబడుతుండటంతో అసలు ఈ ఉత్తమ అధికారులకేమైందనీ అంతటా చర్చసాగుతున్నది.