వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఉగాది ప్రాశస్త్యం

April 6, 2019

వసంత కాలంలో ప్రకృతి అంతా పచ్చదనంతో నిండి ఉంటుంది.. మల్లెల సుగంధం మనసుని మత్తెక్కిస్తుంది.. కోకిల పాటలు అలౌకిక ఆనందాన్ని ఇస్తాయి.. వసంత కాలంలో పుష్పాల్లో మధువు ఎక్కువగా ఉంటుంది.. అందుకే దీన్ని మధుమాసం అంటారు.
చైత్రమాసం అనగానే అందరికీ గుర్తుకు వచ్చే పర్వదినం ఉగాది. కొత్త సంవత్సరం ప్రారంభానికి ఉగాది సంకేతం. ఉగాది అనే పేరు ఎలా వచ్చింది, అందుకు ప్రమాణాలు ఏమిటి అనే చర్చను పక్కన పెడితే ఉగాది రోజున తప్పనిసరిగా చేయవలసిన కొన్నింటిని శాస్త్రం నిర్దేశించింది..
అవేమిటంటే ..అభ్యంగన స్నానం.. అంటే ఆపాదమస్తకం నువ్వుల నూనె రాసుకుని కుంకుడురసంతో ఉగాది రోజున తలంటు స్నానం చేయాలి. నూనె ఔషధ గుణాన్ని, మనిషికి చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అభ్యంగన శరీరానికి ఆవరించి ఉండే జడత్వాన్ని దూరం చేసి శరీరంతో పాటు మనస్సును చైతన్యవంతం చేస్తుంది. ఇలా చైతన్యవంతమైన మనసు ధర్మకార్యాల మీద మాత్రమే లగ్నమవుతుంది. ఎప్పుడైతే మనిషి ధర్మకార్యాలు చేస్తుం టాడో అతనికి భగవ ంతుని కటాక్షం వెంటనే కలుగుతుంది. కాబట్టి నూనె జిడ్డుగా భావించ కుండా ఉగాది రోజున ప్రతి ఒక్కరు అభ్యంగన స్నానం చేయాలి.
గణపతి పూజ.. రాబోయే రోజుల్లో కలిగే విఘ్నాలు నివారించాలని కోరుతూ ఉగాది రోజున గణపతిని ప్రతి ఒక్కరు అర్చించాలి. దీంతో పాటు గ్రహ సంబంధమైన దోషాలు తొలగాలని కోరుతూ నవ గ్రహాలను కూడా పూజించాలి. మనోనిశ్చలత, కార్య సాధన పట్ల దీక్ష ఉంటాయి. ఈ పూజలు చేయడం అలవాటుగా ఉంది. శాస్త్ర నియమాల ప్రకారం ఉగాది రోజున ఈ మహా శాంతి పూజలు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా నిర్వహించాలి.
పంచాంగ శ్రవణం.. పంచాంగ పూజ.. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు అనే ఐదు అంగాలతో కూడినదే పంచాంగం. శాస్త్ర విధానాల ప్రకారం ఉగాది రోజున బంధుమిత్రులతో కలిసి ఉదయం దేవతాపూజ, పంచాంగం పూజ చేసి పిండివంటలు ఆరగించాలి. సాయంత్రం దేవాలయానికి వెళ్లి ధర్మ నిరతి పరులైన పండితులు చెబుతుండగా పంచాంగ శ్రవణం చేయాలి. ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేస్తే చెడు కలలు రావు. శత్రు నాశనం జరుగుతుంది.
గోదానం చేసిన ఫలితం కలుగుతుంది. సకల కార్యాలు సిద్ధిస్తాయి.
ఉగాది పచ్చడి.. ఉగాది రోజున చిన్న, పెద్ద అందరూ ఇష్టంగా తినేది ఉగాది పచ్చడి. వేకువ జామునే లేచి కాలకృత్యాల అనంతరం అభ్యంగన స్నానమాచరించి దైవ పూజ చేసి శుచిగా నియమాల ప్రకారం చేసిన ఉగాది పచ్చడిని దేవునికి నివేదించి ఆ తర్వాత కుటుంబ సభ్యులందరూ వేపపూత పచ్చడి ఆరగించాలి.
అలాగే ఉగాది రోజున ఇంకొక సాంప్రదాయం కూడా అనాదిగా వస్తుంది. అదేంటంటే కొత్త గొడుగు, విసనకర్రలను కొనుగోలు చేయడం. వసంతం తర్వాత వచ్చే ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని భౌతిక ఆరోగ్య సంరక్షణ కొరకు ప్రకృతిలో సహజంగా లభించే తాటి మేదర్లతో తయారుచేసిన గొడుగు విసనకర్రలు ఉగాది రోజున ప్రతి మనిషి స్వీకరించాలి.
ఉగాది నుంచి తొమ్మిది రోజుల కాలాన్ని వసంత నవరాత్రులు అంటారు. ఈ రోజుల్లో భగవంతుడిని ఆరాధించే విధి నియమాలను శాస్త్రం వివరంగా చెప్పింది. దీని ప్రకారం ఉగాది రోజున దేవత మందిరంలో కలశాన్ని ఉంచి పూజించాలి. ఇంటి ఆచారాలు, గురూపదేశాల ప్రకారం ఇతర అర్చన దిన కైంకార్యలు నిర్వహించాలి. పాడ్యమి రోజు నుంచి రామాయణం ప్రారంభం చేసి నవమికి పూర్తిచేసి సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. ఈ తొమ్మిది రోజులు కార్యక్రమాల్ని వసంత నవరాత్రులు అని అంటారు. ఉగాది నుండి మొదలైన ఈ వసంత నవరాత్రులు రాముల వారి కల్యాణంతో ముగుస్తాయి. ఉగాది నుండి ప్రారంభమైన పండగ శోభ మనకు శ్రీ రామ నవమి సీతారామ కల్యాణంతో ముగుస్తుంది. ఈ ఉగాది పండుగ అందరి ఇంట ఆనందోత్సాహాలను, సుఖ సంతోషాలను నింపాలని కోరుకుంటూ విళంబి నామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ.. వికారి నామ సంవత్సరానికి స్వాగతిస్తూ.. సర్వేజనా సుఖినోభవంతు..

– వేణు గీతి