Take a fresh look at your lifestyle.

ఉం‌డేదెవరూ? ఊడేదెవరూ? చేరేదెవరూ?

మళ్లీ ఊపందుకున్న కేబినేట్‌ – అం‌తటా ఆ ఇద్దరు గురించే చర్చ – కేసీఆర్‌ ‌మదిలో ఏముందో తెలియక ఆశావహుల అగచాట్లు
వచ్చే నెలలోనే ముహూర్తమంటూ జోరుగా ప్రచారం – విస్తరణా? ప్రక్షాళననా? – అమాత్యులలో టెన్షన్‌ ‌టెన్షన్‌…
‌తన పనేమో తాను చేసుకుపోతున్న ట్రబుల్‌ ‌షూటర్‌

ఫోటో: తన్నీరు హరీష్‌రావు, కల్వకుంట్ల తారక రామారావు మాజీమంత్రులు(పాత చిత్రం)

తెలంగాణ మంత్రివర్గంపై ప్రచారం మళ్లీ ఊపందుకున్నది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తన మంత్రివర్గ విస్తరణకు ముహూర్తాన్ని కూడా ఖరారు చేసినట్లు..తన కేబినెట్‌లోకి  పలువురు కొత్త ముఖాలను తీసుకోనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలలో బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీ సమావేశాలలోగానే కేబినెట్‌లోకి కొత్త వారిని తీసుకోవాలని సిఎం కేసీఆర్‌ ‌భావిస్తున్నారనీ…సెప్టెంబర్‌ 4‌న కాదంటే 12న తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఉండటం తథ్యమనీ రాజకీయ వర్గాలలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. టిఆర్‌ఎస్‌ ‌శ్రేణులు సైతం ఈ ప్రచారాన్ని ధృవీకరిస్తున్నాయి. కానీ, ప్రగతిభవన్‌ ‌నుంచి, మంత్రివర్గంలోని ముఖ్యుల నుంచి మాత్రం దీనిపై ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేనప్పటికీ…రాష్ట్రంలో ముఖ్యంగా టిఆర్‌ఎస్‌ ‌పార్టీలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలు మాత్రం మంత్రివర్గ విస్తరణకు అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో రెండోసారి టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అధికారంలోకి వచ్చి కేసీఆర్‌ ‌తిరిగి సిఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం కేసీఆర్‌తో కలిపి ఆయన కేబినెట్‌లో 12మంది మంత్రులున్నారు. రాష్ట్ర శాసనసభ సభ్యుల లెఖ్కల ప్రకారం మరో 6గురికి కేసీఆర్‌ ‌తన మంత్రి వర్గంలో చోటు కల్పించే అవకాశం ఉంది. అయితే, ప్రచారం జరుగుతున్నట్లుగా కేసీఆర్‌ ‌తన కేబినెట్‌ను విస్తరిస్తారా? ప్రక్షాళన చేస్తారా? అనేది ఎవరికీ తెలియడం లేదు. ఇంతకూ కేసీఆర్‌ ‌మదిలో ఏముందో ఎవరికీ అర్థం కావడం లేదు, అంతుబట్టడం లేదు. కానీ, ఎట్టి పరిస్థితులలోనూ దసరా పండుగకు అటు ఇటుగా కేబినెట్‌ ‌విస్తరణనో…ప్రక్షాళననో ఉండటం మాత్రం ఖాయమన్న సంకేతాలు గులాబీ శిబిరం నుంచి వొస్తున్నాయి.
అందరిలోనూ టెన్షన్‌…‌టెన్షన్‌…
‌కేసీఆర్‌ ‌సిఎంగా పదవీ బాధ్యతలు చేపట్టి 8నెలలు దాటింది. మంత్రివర్గంను మాత్రం పూర్తిస్థాయిలో భర్తీ చేయలేదు. ఇప్పుడు మంత్రివర్గంపై పూర్తిస్థాయిలో దృష్టిని కేంద్రీకరించారు. ఇది వరకే  ఆగస్టు 15తర్వాత రాష్ట్రంలో పాలనను పూర్తిస్థాయిలో పరుగెత్తిస్తాననీ చెప్పారు. దీన్ని బట్టి సిఎం కేసీఆర్‌ ‌మంత్రివర్గంలో కూర్పులు, మార్పులు,  చేర్పులు చేస్తారన్న సంకేతాలు ఇవ్వకనే ఇచ్చారు. మంత్రివర్గ విస్తరణపై కేసీఆర్‌ ‌దృష్టి కేంద్రీకరించారనీ మీడియాలో వార్తలొస్తుండటం…పార్టీ వర్గాలలోనూ ప్రచారం జరుగుతండటంతో అటు ఆశావహులు…ఇటు మంత్రివర్గంలోనూ అమాత్యులలో ఒకటే టెన్షన్‌కు గురౌతున్నారనీ విశ్వసనీయ సమాచారం. మంత్రివర్గంను విస్తరిస్తే ఒకలా ఉంటుంది. అదే మంత్రివర్గంను ప్రక్షాళన చేస్తే మాత్రం మరోలా ఉంటుందనీ చెప్పాలి. మంత్రివర్గంను విస్తరిస్తే ఇప్పుడున్న మంత్రులను ఢోకా ఉండకపోవచ్చు. అదే, పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తే మాత్రం ఇప్పుడున్న మంత్రులలో కనీసం నలుగురైదురు మంత్రులకు ఉద్వాసన తప్పకపోవచ్చనీ తెలుస్తున్నది. దీంతోనే అటు ఆశావహులు, ఇటు అమాత్యులు సిఎం కేసీఆర్‌ ఏం ‌చేస్తారో…ఆయన మదిలో ఏముందో తెలియక ఆగమాగమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. కేసీఆర్‌ ‌మంత్రివర్గంను విస్తరించినా…ప్రక్షాళన చేసినా మంత్రిర్గంలో చోటు దక్కే వారిలో కల్వకంట్ల తారకరామారావు, తన్నీరు హరీష్‌రావు, గుత్తా సుఖేందర్‌రెడ్డి, పి.సబితాఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌, ‌తుమ్మల నాగేశ్వర్‌రావు, సండ్రవీరయ్య, గంగుల కమలాకర్‌, ‌బాజిరెడ్డి గోవర్ధన్‌, ‌డాక్టర్‌ ‌లక్ష్మారెడ్డి, జోగు రామన్న, వినయ్‌ ‌భాస్కర్‌, ‌పువ్వాడ అజయ్‌, అరికెపూడి  గాంధీ, మాగంటి గోపినాథ్‌ ‌తదితరుల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.   ప్రస్తుతం కేబినెట్‌లోకి కొత్తగా ఆరుగురికి అవకాశం ఇచ్చే విధంగా వెసులుబాటు ఉంది. ప్రచారం జరుగుతున్నట్లుగా నలుగురిని తప్పిస్తే మొత్తంగా 10 మందికి అవకాశం దక్కనుంది. అయితే, ప్రస్తుతం ప్రక్షాళన దిశగా కేసీఆర్‌ ఉన్న వారిలో కొందరి పైన వేటు వేస్తారా? లేక కొత్త వారికి చోటు ఇవ్వటానికి కేబినెట్‌ ‌విస్తరణగా చేపడుతారా? అనేది తేలాల్సి ఉంది.  అయితే, కేసీఆర్‌ ‌తన కేబినెట్‌ను విస్తరించినా, ప్రక్షాళన చేసినా కేటీఆర్‌కు మాత్రం కచ్చితంగా తన కేబినెట్‌లో అవకాశం కల్పించే అవకాశం ఉందనీ పార్టీ వర్గాలలో వినబడుతున్నది. అలాగే, మహిళా కోటాలో సబితారెడ్డి(రెడ్డి), సత్యవతి రాథోడ్‌(ఎస్టీ)కి తప్పకుండా చోటు దక్కే అవకాశం ఉందనీ అంటున్నారు.  సామాజిక ఈక్వేషన్ల కారణంగా గుత్తా సుఖేందర్‌రెడ్డికి మంత్రి పదవీని ఇవ్వలేని పరిస్థితులలో శాసనమండలి ఛైర్మన్‌గా అవకాశం కల్పిస్తారన్న ప్రచారమూ జరుగుతోంది. కేబినెట్‌ ‌గురించి ప్రచారం ఊపందుకోవడంతో ఓ పక్కన ఆశావహులు, మరో పక్కన అమాత్యులు సిఎం కేసీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. సిఎం కేసీఆర్‌ను కలిసే అవకాశం లేనివారు పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంటు కల్వకుంట్ల తారక రామారావును కలుస్తూ తమకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలనీ కోరుతున్నట్లు తెలుస్తుంది.
హరీష్‌ ‌గురించి అంతటా చర్చ…
తన పనేమో తాను అన్నట్లుగా హరీష్‌…
‌రాష్ట్రంలో ముఖ్యంగా అధికార టిఆర్‌ఎస్‌ ‌పార్టీలో కేబినెట్‌పై వాడివేడిగా ప్రచారం సాగుతోంది. మొత్తానికి తెలంగాణ కేబినెట్‌ ‌విస్తరణకో, ప్రక్షాళనకో మాత్రం  రంగం సిద్దమైంది. వారంలోగా కేబినెట్‌ ‌విస్తరణనో..ప్రక్షాళననో ఖాయమని పార్టీ సీనియర్లు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి దీని పైన తుది కసరత్తు చేస్తున్నట్లు వివ్వసనీయ సమాచారం. ఇందుకు సెప్టెంబర్‌ 4‌న ముహూర్తంగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు టీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్‌ను కేబినెట్‌ ‌లోకి తీసుకోవటం ఖరారు అయిందనీ అంటున్నారు. అయితే, పార్టీలో సీనియర్‌ ‌నాయకుడు, ట్రబుల్‌షూటర్‌, ‌మాజీమంత్రి, సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గం ఉంచి వరుసగా ఆరు పర్యాయాలు భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందుతూ వస్తున్న తన్నీరు హరీష్‌రావుకు ఈ దఫా కేబినెట్‌లోనైనా ఛాన్స్ ఉం‌టుందా?లేదా? అన్నదానిపై అంతటా చర్చ జరుగుతోంది. రాజకీయవర్గాలలో ఇదే హాట్‌ ‌టాపిక్‌గా మారింది. కేసీఆర్‌ ‌సిఎంగా రెండోసారి బాధ్యతలు చేపట్టాక అటు కుమారుడు కేటీఆర్‌, ఇటు మేనల్లుడైన హరీష్‌ ఇద్దరినీ మంత్రివర్గంలోకి తీసుకోలేదు. కేటీఆర్‌కు మాత్రం పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంటు పదవీని కట్టబెట్టారు. ఇదంతా పార్టీలో హరీష్‌రావు ప్రాధాన్యతను తగ్గించడం కోసమే చేశారన్న ప్రచారం ఉంది. అయితే,  హరీష్‌కు ప్రాధాన్యత తగ్గించకూడదన్న భావన ఎక్కువ కాలం కొనసాగించకూడదని భావించి..ఆయన్ను కూడా కేబినెట్‌లోకి తీసుకొని కీలక మంత్రి పదవీని కట్టబెట్టొచ్చనీ ఓ వైపు జరుగుతుండగా… మరోవైపేమో ఈ దఫా కూడా  హరీష్‌కు మంత్రి పదవీ ఇవ్వకపోవచ్చన్న డౌటానుమానం వ్యక్తం చేస్తున్న నేతలు టిఆర్‌ఎస్‌ ‌పార్టీలో లేకపోలేదు. అయితే, అందరూ  హరీష్‌రావుకు మంత్రి పదవీ ఇస్తారా? ఇవ్వరా?అన్నదాని గురించి మాట్లాడుకుంటుంటే…హరీష్‌రావు మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా తన పనేమో తాను అన్నట్లుగా తను ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్ధిపేట నియోజకవర్గంలోనే ప్రతి నిత్యం తిరుగుతున్నారు. ప్రజల మధ్యనే ఉంటున్నారు. రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ప్రయివేట్‌ ‌ట్యూషన్లు, అల్ఫాహారంను పెట్టించే సరికొత్త పనిలో నిమగ్నమై ఉన్నారు. బుధవారం తన దత్తత గ్రామమైన ఇబ్రహీంపూర్‌లో ప్రారంభించారు కూడా. ఆయన రోజువారీ షెడ్యూల్‌ ‌చూస్తుంటే అసలు కేబినెట్‌ ‌గురించి ఏమాత్రం ఆలోచన చేస్తున్నట్లు లేదనీ సిద్ధిపేటకు చెందిన టిఆర్‌ఎస్‌ ‌నేతలు ‘ప్రజాతంత్ర’తో  మాట్లాడుతూ చెప్పారు. ఏది ఏమైనా  కేసీఆర్‌ ‌ఫైనల్‌గా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. చూడాలి మరి!

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!