Take a fresh look at your lifestyle.

ఈ ‌నాయకులు ఎవరికి జవాబుదారి..?

ప్రతీ ప్రజాప్రతినిధి తాము ప్రజలకు జవాబుదారిగా ఉంటామని ప్రజలకు హామీ ఇస్తుంటారు. నైతిక విలువల గురించి ఉపన్యాసాలిస్తుంటారు. కాని, పొరపాటున వారు అధికార పార్టీలో లేకపోతే ఆ విషయాన్ని చూరులో చెక్కడం కూడా అంతే ఆనవాయితీగా మారింది. పదవులు, ఇతర ప్రలోభాలకు లోనవడమేకాకుండా చివరకు ఎవరికీ చెప్పకుండానే పార్టీ జెండాను మార్చేస్తుంటారు. అదేమంటే తాము చేరుతున్న అధికారపార్టీ అధినేత పాలనాతీరు బాగుందని, ప్రజలకు ఆ పార్టీ చేస్తున్న సేవల తీరు తమను ఆకర్షించిందని, తామెందుకు ఆకర్షితుల మవుతున్నామన్న విషయాన్ని నిగూఢ•ంగా ఉంచి మాట్లాడటం ఇటీవల కాలంలో కామన్‌ అయిపోయింది. భవిష్యత్‌ ఆశలు వారిని అంధులను చేస్తున్నాయి. ఇప్పుడు కొత్త రకం ట్రెండ్‌కూడా మొదలైందంటున్నారు. అదేమంటే అధికారంలో ఉన్న పార్టీలు భయాందోళనలకు గురిచేయడం. తమ పార్టీ తీర్థం పుచ్చుకోకపోతే పాతకేసులను తిరగదోడడమో, అధికార సంస్థలతో వారి వ్యాపారసంస్థలపై దాడులు చేయించడమో జరుగుతున్నది. ఇటీవల కాలంలో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి సంఘటనలు తరుచు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తెలంగాణ ఏర్పడక ముందు అటు కేంద్రంలో ఇటు ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చికూడా ఆ క్రెడిట్‌ను పొందలేకపోయింది. కర్ణుడి చావుకు అనేక కారణాలున్నట్లు, ఆ పార్టీ ప్రత్యేక రాష్ట్రంలో జరిగిన మొదటి ఎన్నికల్లోనే చావుదెబ్బ తినాల్సి వచ్చింది. కేంద్రంలోనూ అదే పరిస్థితి ఎదురైంది. అంతవరకు అధికారంలో ఉన్న ఒక్కో రాష్ట్రాన్ని కోల్పోతూ క్షీణ చంద్రుడిలా తయ్యారైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నిన్నటివరకూ ఆ పార్టీ పరిస్థితిలో ఏం మార్పులేదు. కాకపోతే బీజే•పీతో దోస్తీ విడిచిపెట్టి, కాంగ్రెస్‌ను టీడీపీ• పట్టుకోవడంతో ఏపీ•లో కాంగ్రెస్‌ ‌కాస్తా మెరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాని, తెలంగాణలో మాత్రం ఆ పార్టీ కనుమరగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గుడ్డిలో మెల్ల అన్నట్లు తెలంగాణ రాష్ట్రంలో తాజాగా జరిగిన ఎన్నికల్లో కేవలం 19 స్థానాలను మాత్రమే గెలుచుకున్న కాంగ్రెస్‌ ‌పార్లమెంటు ఎన్నికలు వచ్చేవరకు ఆ పందొమ్మిది మందిని కాపాడుకోలేకపోతోంది. ఒకరా ఇద్దరా వరుసగా ఆరుగురు ఎమ్మెల్యేలు చేతికి చెయ్యిచ్చి, కారెక్కేస్తున్నారు. తమకు టికెట్‌ ఇచ్చిన కాంగ్రెస్‌పార్టీతో గాని, తమను గెలిపించిన ప్రజలతో గాని ఏమాత్రం సంబంధం లేనట్లుగా ఏదో ఓ ముహూర్తన తమ సొంతంగా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు వారికి ప్రజల జవాబుదారి తనం లాంటి పదాలేవీ గుర్తుకు వచ్చినట్లు లేదు. నైతిక విలువలన్నవి రాజకీయ పార్టీలకు వర్తించవన్న విషయం దీనివల్ల రూఢీ అవుతున్నది. వస్తున్న వార్తలను బట్టి చూస్తుంటే ఈ ఆరుగురితోనే ఈ వలసలకు బ్రేక్‌ ‌పడుతున్నట్లుగా లేదు. మరికొందరు కూడా ఇదే బాట పట్టేట్లుగా కనిపిస్తోంది. దీన్నిబట్టి చూస్తే శాసనసభలో ప్రతిపక్ష హోదా కూడా ఆ పార్టీకి మిగిలేట్లుగా కనిపించడంలేదు. కాంగ్రెస్‌ ‌శాసనసభ పక్ష నాయకుడు మల్లు భట్టి విక్రమార్క అన్నట్లు ఎన్నో త్యాగాలు చేసి కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు ఈ నాయకులను గెలిపించుకుంటే వారి శ్రమను, త్యాగాలను ఈ నాయకులు తాకట్టు పెడుతున్నారు. ఎన్నో చట్టాలను రూపొందించే చట్ట సభకు ఎంతో నమ్మకంగా ప్రజలు వీరిని పంపిస్తే, వారి నమ్మకాన్ని వమ్ముచేస్తూ రాజ్యాంగ సూత్రాలకే తిలోదకాలిస్తు న్నారన్న ఆయన మాటల్లో కనిపించే ఆవేదనకన్నా వాస్తవాన్ని గ్రహించాల్సిన అవసరముంది. తాము పార్టీ మారినందున అవసరమైతే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి తిరిగి టిఆర్‌ఎస్‌- ‌బి ఫారంపైన గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న నాయకులు అలా గెలవడం వల్ల ప్రజలకొచ్చే ఉపయోగమేంటో చెప్పాల్సి ఉంది. అంతకు ముందు గెలిపిస్తే చేసిందేమిటో, ఇప్పుడు గెలిపిస్తే అంతకన్నా గొప్పగా చేసేదేమిటో అర్థంకాదు. పార్టీ మారుతున్న వారేమీ అల్లాటప్పా వారేమీకాదు. వీరిలో చాలామంది సీనియర్లున్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీలో మంచి పదవులు అలంకరించినవారు, మంత్రులుగా కొనసాగిన వారున్నారు. వీరంతా అధికారం లేకపోవడంతో విలవిలలాడిపోతున్నట్లు దీనివల్ల స్పష్టమవుతున్నది. కాని, అధికార పార్టీలో ఉంటే ప్రజలకు మేలైన సేవలు అందించవచ్చన్న ఉద్దేశ్యంగా చేరుతున్నట్లు చెబుతుండడం ఇలాంటి వారికి అలవాటైపోయింది. మొత్తానికి కాంగ్రెస్‌లోని పందొమ్మిది ఎమ్మెల్యేలకు గాను చివరకు ఇద్దరు, ముగ్గురే మిగిలేట్లుగా కనిపిస్తోంది. వారు కూడా చివరి వరకు ఉంటారో లేదో తెలియదు. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు చేసే విపరీత చర్యలకు ఇది నిదర్శనం. ఇందుకు ఏ పార్టీ అతీతం కాదు. ఇవ్వాళ నువ్వెందుకు ఈ తప్పుచేస్తున్నావని అడిగే అవకాశం ఎదుటి పార్టీకి లేకుండా పోయింది. ఎందుకంటే మీరు అధికారంలో చేసింది కూడా ఇదేకదా అన్న సమాధానం వెంటనే వస్తుంది. అందుకే రాజకీయ పార్టీలు, నాయకులు రాజ్యాంగ సూత్రాలను, నైతిక విలువలు, జవాబుదారితనం గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది.

ఈ ఎన్నికల్లో కీలకాంశాలు లేవు.. ప్రభంజనాలు లేవు…
వోటర్లపై బాలాకోట్‌ ‌మెరుపుదాడుల ప్రభావం ప్రశ్నార్థకం
రానున్న లోక్‌సభ ఎన్నికలకు రెండు ప్రధానాంశాలు తెరమీదికి వస్తున్నాయి.
మొదటిది.. బీజేపీకి ఎక్కువ సానుకూల పరిస్థితి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ జనాకర్షణ, ఇప్పటికీ ప్రజల్లో ఆయన పట్ల విశ్వాసం, ఆయన అంకిత భావం పట్ల ఆకర్షణ, మొదలైన అంశాలు మాత్రమే కాదు. అలాగే, పుల్వామా ఉగ్రవాద దాడి, బాలాకోట్‌ ‌మెరుపుదాడుల వల్ల జాతీయ వాదం, దేశభక్తి పెల్లుబుకడం వల్ల పాకిస్తాన్‌కు ఆయన గట్టి గుణపాఠం చెప్పడం వల్ల.
రెండోవాదం.. పూర్తిగా ప్రతిపక్షం పాత్రపై కేంద్రీకృతం అయి ఉంది. కాంగ్రెస్‌ ‌తప్పొప్పులు, చేసిన పొరపాట్లు ఎన్నో ఉన్నాయి. కాంగ్రెస్‌ ‌చుక్కాని లేని నావలా ఉంది. పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసే వారు ఎవరూ లేరు. సమష్టిగా వ్యవహరించడంలో తన బలహీనతను బయటపెట్టుకుంటోంది. మిత్ర పక్షాలతో పొత్తుల విషయంలో సరైన నిర్ణయాలను తీసుకోలేకపోతోంది. ఇందుకు ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌), ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌ ‌వాదీ, బీఎస్పీలు ఇవ్వజూపిన సీట్లను తిరష్కరించడం, మహాకూటమిలో రాష్ట్ర స్థాయి పార్టీలతో జత కట్టలేకపోవడం. సరైన ప్రతిపక్షం లేకపోతే సహజంగా బీజేపీ విజయానికి ఎటువంటి సమస్యలు ఉండవు.
ఈ రెండు వివరణలూ ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతున్నాయి. మరో వంక బీజేపీ సంకీర్ణాలను ఏర్పాటు విషయంలో దూకుడు పెంచింది. ఇందుకు బీహార్‌, ‌మహారాష్ట్రలలో మిత్ర పక్షాలైన జనతాదళ్‌ (‌యు), శివసేనలతో కుదుర్చుకున్న ఒప్పందాలు. అలాగే, అసోంలో అసాం గణపరిషత్‌ను కూడా జత చేకూర్చుకుంది. పొత్తుల విషయంలో బీజేపీ పట్టు విడుపులతో వ్యవహరిస్తోంది. కాంగ్రెస్‌లో ఆ ధోరణి కనిపించడం లేదు. కాంగ్రెస్‌ ‌ధోరణి వల్ల బీజేపీ తన పరిస్థితిని మరింత మెరుగు పర్చుకుంటోంది.

మెరుపుదాడులు రాజకీయ ప్రయోజనం చేకూరుస్తాయా?
విస్తృతము, విశాలమైన ఈ ఆలోచనలను లోతుగా పరిశీలించాల్సి ఉంది. పరిస్థితి పైకి కనిపించినంత సునాయాసంగానూ, తేలికగానూ లేదు. మన దేశంలో గతంలో జరిగిన ఎన్నికలపై ఊహాగానాలూ, అంచనాలన్నీ తారుమారయ్యాయి. రాజకీయ పండితుల లెక్కలను తారుమారు చేయడంలో మన వోటర్లు సిద్ధహస్తులు. 2004 ఎన్నికల్లో అప్పటి ప్రధాని వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్‌డిఏ -1 ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, కార్యక్రమాల కారణంగా భారత్‌ ‌వెలిగి పోతోందన్న అభిప్రాయాన్ని కలిగించేందుకు ప్రయత్నించారు. అయితే, ఫలితాలు మరో విధంగా ఉన్నాయి. బీజేపీకి పూర్తి నిరాశ కలిగించాయి.ఆశ్చర్యపర్చాయి. అదే సమయంలో కాంగ్రెస్‌ని కూడా. అప్పట్లో కాంగ్రెస్‌ ఏకైక ప్రధాన పార్టీగా వస్తుందని ఆ పార్టీ అనుకోలేదు. పూర్తి మెజారిటీ వస్తుందనుకుంది.
ప్రస్తుతం పలువురు బీజేపీ నాయకులు మెరుపు దాడుల ప్రభావం తమ పార్టీకి ఎంతో మేలు చేకూరుస్తుందని బీజేపీ నాయకులు ఆశిస్తున్నారు.
ఆక్రమిత కాశ్మీర్‌లోని బాలకోట్‌లో మన దళాలు జరిపిన మెరుపుదాడుల ప్రభావం పెద్దగా ఉంటుందని ఆ పార్టీ పెద్దగా ఆశలు పెట్టుకుంది.అయితే, పాలనా వ్యవహార్లాలో మోడీ ప్రభుత్వం ప్రజలకు పూర్తి నిరాశను మిగిల్చింది. పాక్‌ ‌సైన్యానికి పట్టుబడి, సురక్షితంగా విడుదలైన వాయుసేన వింగ్‌ ‌కమాండర్‌ ‌పార్టీ విజయానికి తోడ్పడతారని భావిస్తున్నారు. అందుకు తగినట్టుగానే బీజేపీ అనుకూల మీడియా హోరెత్తించే ప్రచారాన్ని చేస్తోంది.
ఇంతకుముందు వరకూ బీజేపీ ఎంతో కలవరపడింది. ఇప్పుడు ధీమాతో ఉంది. కనీసం హిందీ రాష్ట్రాల్లో తమదే విజయమన్న ధీమాతో ఉంది.
మెరుపుదాడులు నరేంద్రమోడీకీ, బీజేపీకి వోట్లు రాల్చి పెడతాయా? మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యల పరిస్థితి ఏమిటి? విజయవాడలో చిన్న వ్యాపారుల పరిస్థితి ఏమిటి? కోచ్చిలో మత్య్సకారులు, పశ్చిమ బెంగాల్లో వర్తకులు సుఖంగా ఉన్నారా? నిజమే దేశభక్తిని మెరుపుదాడుల సంఘటన ఉప్పొంగింపజేసింది. కానీ, సామాన్యుల స్థితిగతులు దుర్భరంగా ఉన్నాయి. ఆదాయం పడిపోయింది. ధరలు పెరిగిపోయాయి. నిరుద్యోగం ఎన్నడూ లేని విధంగా తాండవిస్తోంది. వీటి ప్రభావం వోటర్లపై ఉండదా?

ఇక ప్రతిపక్షాల సంగతి తీసుకుంటే కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కనిపించిన ఐక్యత, సౌహార్దత ఏమైపోయాయి. అంతర్గత లోపాల వల్ల మహాకూటమి ఏర్పాటు కార్యరూపం దాల్చడం లేదు. తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ‌ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వంటి ప్రముఖులు దూరంగా ఉంటున్నారు. ఎవరికి వారే తమ ఆకాంక్షలను బహిర్గతం చేస్తున్నారు.
ప్రతిపక్షాలు అప్పటికప్పుడు కలిపి ఉంచుతున్న తాత్కాలిక ఏర్పాట్లు ఈ ఎన్నికల్లో శాశ్వతంగా ఉంటాయన్న అభిప్రాయం కలగడం లేదు. ప్రాంతీయ పార్టీలు తమ రాష్ట్రాల్లో బీజేపీని వొడించేటందుకు సిద్ధంగా ఉన్నాయి. కానీ, ఇవన్నీ ఎన్నికల తర్వాత ఒకే తాటిపైకి వస్తాయా..?

గత ఎన్నికల్లో మాదిరి బీజేపీకి 300 సీట్లు వచ్చే అవకాశం లేదు. ఈసారి 125 సీట్లు వస్తాయేమో, అప్పుడు ప్రాంతీయ పార్టీల మద్దతు తీసుకోవల్సి వస్తుంది. తెరాస, బీజేడి వంటి పార్టీలు బీజేపీకి ఏమేరకు మద్దతు ఇస్తాయి. వాటి డిమాండ్లు చాలా ఎక్కువగానే ఉండవచ్చు. ప్రధాని నరేంద్రమోడీ వారి డిమాండ్లను గౌరవిస్తారా? సర్దుకుని పోతారా? బీజేపీ 160 సీట్లు గెల్చుకుంటే బీజేపీ సీనియర్‌ ‌నాయకులు తిరుగుబాటు చేస్తారా..?
ఇందిరాగాంధీ, రాజీవ్‌ ‌గాంధీ మరణానంతరం జరిగిన ఎన్నికల్లో మాదిరిగా 400 సీట్లు వచ్చే అవకాశం లేదు. అన్ని పార్టీలూ దారిద్య్రాన్ని నిర్మూలిస్తామని, వృద్ధి రేటు పెంచుతామని వాగ్దానం చేస్తున్నాయి. జాతీయవాదం, సాయుధదళాల సాహస చర్యలతో వోట్లు పొందాలని చూస్తే జరిగే పని కాదు. అయితే, బాలాకోట్‌ ‌మెరుపుదాడులతో రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ చూస్తోంది. మరో వంక ప్రతిపక్ష నాయకులు తమ పొత్తుల ప్రక్రియను ఇంకా కొనసాగిస్తున్నారు. రాజకీయ విశ్లేషకుల ఊహాగానాలకు ఇంధనాన్ని అందిస్తూనే ఉన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో వాతావరణం ఫలానా వారికి అనుకూలంగా ఉందని చెప్పలేం.ఏమైనా జరగవొచ్చు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!