వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

‘ఈటల’ తూటాలు..!

August 30, 2019

ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ‌మాటలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నిన్నటి వరకు మాజీ మంత్రి హరీష్‌ ‌రావుపై వస్తున్న వార్తలను సులభంగా తీసివేసినప్పటికీ, రాజేందర్‌ ‌విషయంలో మాత్రం రాజకీయ పార్టీలు లోతుగా అధ్యయనం చేస్తున్నాయి. ఎంతో సౌమ్యంగా, మృధువుగా మాట్లాడే రాజేందర్‌కు ఒక్కసారే ఇంతకోపం ఎందుకొచ్చిందన్నదే ఇప్పుడు ప్రధాన చర్చ. రాష్ట్ర శాసనసభకు జరిగిన ముందస్తు ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీని సాధించుకున్న టిఆర్‌ఎస్‌ ‌ప్రతిపక్షాలకు ఏమాత్రం ఉనికిలేకుండా చేయడంలో దాదాపుగా సఫలమైంది. శాసనసభలో కావాల్సినంత మెజార్టీ ఉన్నప్పటికీ కెసిఆర్‌ ఇతర పార్టీల శాసనసభ్యులను ఎందుకు ఆహ్వానిస్తున్నట్లు అన్న ప్రశ్నకు రాజేందర్‌ ‌రూపంలో ఎంతో కొంత సమాధానం లభించినట్లైంది. పైకి ఎంతో ప్రశాంతంగా కనిపిస్తున్నా అంతర్గతంగా టిఆర్‌ఎస్‌లో ఏదో జరుగుతున్నదన్న అనుమానాలు చాలా కాలంగా వ్యక్తమవుతున్నాయి. పార్టీ విషయంలోగాని, పాలన విషయంలోగాని ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌తీసుకుంటున్న నిర్ణయాలను అటు ప్రతిపక్షాలు, ఇటు అసమ్మతి వర్గాలు నిషితంగా పరిశీలిస్తూనే ఉన్నాయిగాని, టిఆర్‌ఎస్‌ ‌నుండి ఎలాంటి లీకులకు అవకాశం లేకుండా పోవడంతో ‘సబ్‌ ‌టీక్‌ ‌హై’ అన్నట్లుగా నడుస్తోంది. ఈటల తాజా ప్రసంగం ఈ ప్రశాంతతను ఒక్కసారే భగ్నం చేసినట్లైంది. ఇంతకాలం ఆ పార్టీలో ఏదో జరుగుతున్నదనుకోవడంతోనే సరిపోయింది కాని, ఈటల మాటలతో నిజంగానే నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి జ్వాలగా బయటికి వచ్చినట్లైంది. ఏదోలేకపోయినట్లైతే ఈటల తన ప్రసంగంలో ఈటల్లాంటి మాటలను సంధించి ఉండేవాడు కాదన్న విషయం బయటి ప్రపంచానికి అవగతమైంది. ఆ తర్వాత పార్టీ వర్గాలు ఆయనకు ఏంచెప్పాయో తెలియదు గాని, తన మాటలపైతానే సవరింపు వివరణ ఇచ్చుకున్నప్పటికీ, ఆయన చెప్పదల్చుకున్న నాలుగు మాటలు సూటిగా ఎవరికి తగులాలనుకున్నాడో వారికి తగిలే ఉంటాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆవేశంగా, ఆగ్రహాంగా ప్రసంగించినా పార్టీని గాని, పార్టీ అధినేతపైగాని ఎలాంటి విమర్శ చేయకపోవడంతో అలాంటి అవకాశం కోసం ఎదురుచూస్తున్న ప్రతిపక్షాలకు కొంత అసంతృప్తిని మిగిల్చింది. వారికి అధికారపార్టీని అడుకునే అవకాశం అంతగా లభించకుండా పోయింది. గురువారం హుజురాబాద్‌లో కాంగ్రెస్‌ ‌నాయకుడు కాసిపేట శ్రీనివాస్‌ ‌టిఆర్‌ఎస్‌ ‌పార్టీలో చేరుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎవరూ ఊహించని విధంగా ఈటల చేసిన ఆవేశపూరిత ప్రసంగం ఒక విధంగా టిఆర్‌ఎస్‌ను ఒక్క కుదుపు కుదిపేసిందనే చ•ప్పాలి. ఇటీవల కొంతకాలంగా ఈటలను పార్టీ చిన్నచూపు చూస్తున్నదని, పొమ్మనలేక పొగ పెడుతున్నట్లు కొన్ని పత్రికలు, ఎలక్ట్రానిక్‌ ‌మీడియాల్లో వార్తలు రావడంపై ఇంతకాలం మౌనంగా ఉన్న ఈటల ఒక్కసారే ఔట్‌ ‌బర్సట్ అయ్యాడు. ఆయన మాటలవెనుక చాలాకాలంగా ఆయన ఏదో ఒత్తిడికి గురవుతున్నట్లుగా కనిపించింది. మంత్రి పదవిపైన, పార్టీలో ఉనికిపైన వస్తున్న ఊహాగాలన్నిటికీ ఈ వేదికద్వారా ఆయన ఘాటుగానే సమాధానం చెప్పినట్లు కనిపించింది. ఈ సందర్భంగా ఆయన వాడిన పదాలు ఏమాత్రం ఆలోచించకుండా, సమయాన్నిబట్టి (స్పాంటెనియస్‌గా)వచ్చినట్లు లేవంటున్నారు రాజకీయ పరిశీలకులు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఆర్థిక మంత్రిత్వ శాఖ నిచ్చి రాజేందర్‌కు సముచిత గౌరావాన్నే కల్పించింది. రెండవసారి టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పదవి లేదా అంతకన్నా ఉన్నతమైన పదవిలో కాకుండా ఆరోగ్యశాఖమంత్రి పదవితో ఈటలను సరిపెట్టడం అంతర్గతంగా పార్టీలో ఏదోజరుగుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతూ వచ్చాయి. ఆరోగ్యశాఖను ఇచ్చేక్రమంలోకూడా చివరి నిమిషంలో నిర్ణయం తీసుకున్నట్లు వార్తలొచ్చాయి. ఒక విధంగా ఈటలకిది ఇబ్బందికరమైన అంశమే అయినప్పటికీ ఆయన ఈ విషయంలో ఎక్కడ బయటపడలేదు. కాని, మనోవేదనను కలిగించిన ఈ ఘటనపై ఆయన ఈ సభ వేదికపై పరోక్షంగా స్పందించినట్లు కనిపించిందంటు న్నారు రాజకీయ పరిశీలకులు. ‘మంత్రి పదవి బిక్షకాదు’ అన్న ఆయన మాటల వెనుఉన్న అర్థాన్ని వెతుకుతున్నారు. ఎవరో బిక్షగా వేస్తే తనకు మంత్రి పదవిరాలేదని, మూడున్నర కోట్ల ప్రజల గొంతుకై, రాష్ట్రాన్ని సాధించిన బిడ్డగా తెలంగాణ ప్రజలిచ్చిన మంత్రి పదవి ఇదని ఆయన ఆవేశపూరితంగా చెప్పుకొచ్చారు. అందుకే (తాను పైన వేసుకున్న గులాబీ కండువ చూపిస్తూ) ఈ గులాబీ కండువకు ఓనర్లమంటూ చేసిన ప్రసంగం వెనుకున్న గూడార్థాన్ని శోధించేపనిలో పడింది యావత్‌ ‌తెలంగాణ. అంతేకాదు ఈటల నోటి నుండి వచ్చిన ప్రతీమాట ఆయన ఎవరికి తగలాలనుకున్నాడో వారికి ఈటల్లా తగిలే ఉంటాయి. తనది రాజకీయ కుటుంబం కాదని, ఒక అనామక మనిషిలా వచ్చి.. ఈ గడ్డమీద ఆరుసార్లు ఎంఎల్‌ఏగా గెలవడమన్నది సాధారణ విషయం కాదన్న ఈటల లక్షలాది మంది తెలంగాణ బిడ్డలతో కలిసి ఉద్యమించడం వల్లే ప్రజలు తనకీ గౌరవాన్ని కట్టబెట్టారంటూ, ‘మంత్రిపదవే రాకపోతుండెనని’ ఓపత్రిక రాసిన తీరును ఉటంకిస్తూ ఈటల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు, అలాగే ‘మేం అడుకొచ్చినోళ్ళంకాదు.. మధ్యలో వచ్చినోళ్ళంకాదు.. గులాబీ జండాను తెలంగాణ గడ్డమీద గుబాళింప చేసినోళ్ళం.. అందుకే ఓనర్లమంటూ ఆయన గులాబీ కండువ చూపించిన తీరు పార్టీలో ఓ వర్గం ఆయన్ను టార్గెట్‌ ‌చేస్తున్నదన్న అనుమానాలకు తావేర్పడుతోంది. ఏదేమైనా టిఆర్‌ఎస్‌లో ఇంతకాలం గూడుకట్టుకుని ఉన్న అసంతృప్తి ఈటల మాటలతో కొంతవరకు బయటపడ్డట్లేనంటున్నారు. అయితే ఈ అసంతృప్తి జ్వాల ఇక్కడితో చల్లారుతుందా, ఆపార్టీలో దావానలంగా మారుతుందా అన్నది రానున్న పరిణామాలే తేల్చనున్నాయి.