సమాజపు ఉజ్వల భవితతో
ఆటలాడుతోంది నేటి రాజకీయం.
ఆహా! ఏమి పాలన పదాలే లేకపోయె
పొగడడానికిజి
ఓట్లు రాల్చుకోవడమే లక్ష్యంగా
ఉచితాల సంతర్పణలతో
రాజకీయం ఎంత ఎదిగింది.
పదవంటే ‘‘పంచడమే’’ననే కొత్త నిర్వచనానిచ్చిన
దూరదృష్టి కొరవడిన నాయకుల
పదవి,అధికారం వెంపర్లాటలో
నీతి, నియమం,సిగ్గూ,లజ్జా లేక
మద్యాన్ని అమ్ముతూ,అప్పుల్ని చేస్తూ
రాజ్యపు ప్రగతిని సమాధి చేస్తూ
పబ్బం గడుపుతోంది నేటి రాజకీయం.
రాబందుల,కామాంధులపాలిట స్వర్గధామమై,
అధికారమదంతో
ప్రశ్నించడానికి,విశ్లేషించడాని
వెనుకంజ వేసే స్థితిలో జనతను నెడుతూ
తప్పుడు కేసుల సంకెళ్లతో
ప్రత్యర్థుల్ని బందీల్ని చేస్తోన్న నేటి రాజకీయం
భావ వికాసానికి మార్గం కాదు.
అధికారమంటే విశృంఖలత్వం కాదు
ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడం కాదు
సమాజాహిత దృక్పధంతో
మంచి,చెడుల విశ్లేషణాశక్తితో పాలకులుండాలి
అరాచకం ఆకాశమంత ఎత్తుకెదిగితే
ప్రజల ఆలోచనలు అగ్నిజ్వాలలై రేగుతాయి.
ప్రేమించడం నేర్పిన నిన్నటి స్పర్శ
ద్వేషించడం కూడా నేర్పుతుందని
మరవకూడదు పాలకులు.
కాలానికి కర్మకి ఎవ్వరూ అతీతులు కారు,
వచ్చిపోయే అతిధులమే అందరం అని
గుర్తెరగాలి.
నేటి పాలకుల కళ్ళు
మంచినే చూస్తే ఎంత బాగుండు,
నోరు మంచినే మాట్లాడితే ఎంత బాగుండు.
క్షుద్ర రాజకీయ బలం వాడి, వేడి తగ్గాలంటే
మనలో కుమ్ములాటలు తగ్గాలి
ఆలోచనాధోరణి పెరగాలి
మనలో పెరిగే వివేకమే దానికి చివరి మెట్టు
– వేమూరి శ్రీనివాస్
9912128967
తాడేపల్లిగూడెం-