వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఇక నక్సలిజంపై దృష్టి..!

August 26, 2019

భారీస్థాయిలో చర్యల దిశగా కేంద్రం వ్యూహం ???
ఢిల్లీలో ముఖ్యమంత్రుల సమావేశం
జమ్మూకాశ్మీర్‌ ఆర్టికల్‌ 370‌ని రద్దు చేస్తూ సంచలన నిర్ణయాన్ని తీసుకుని అమలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ ‌షా ఇప్పుడు దశాబ్దాలుగా దేశ అంతర్గత భద్రతకు సవాల్‌గా మారిన నక్సలిజంపై దృష్టి పెట్టారా??? పూర్తిస్థాయిలో సమాచారసేకరణ లక్ష్యంగా జాతీయస్థాయిలో నక్సల్‌ ‌ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహించి ప్రస్తుత సమస్యని సరిగ్గా అంచనా వేయడానికి, తద్వారా ఇటు కేంద్ర బలగాల సాయంతో అణిచివేస్తూనే, అటు అభివృద్ధి మంత్రంతో ప్రభావిత ప్రాంతాల ప్రజలను మళ్ళీ నక్సలిజం వైపు వెళ్లకుండా చేసే ద్విముఖ వ్యూహంతో చర్యలకు అడుగులు వేస్తున్నటు కనిపిస్తుంది. సోమవారం ఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశానికి అమిత్‌ ‌షా అంతర్‌ ‌రాష్ట్ర మండలికి ఛైర్మన్‌గా హాజరయ్యారు. దేశంలో 10 జిల్లాలు మావోయిస్టుల ప్రభావ ప్రాంతాలుగా గుర్తించారు. ఏపీ, తెలంగాణ, ఛత్తీస్‌ ‌గఢ్‌, ‌జార్ఖండ్‌, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, ‌బిహార్‌, ‌మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ ‌ప్రదేశ్‌లలో మావోయిస్టలు విస్తృతంగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు కేంద్రం గుర్తించింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం, స్థానికులను వాటిల్లో భాగస్వామ్యులను చేయడం వంటి చర్యల వల్ల వారిని నియంత్రించ వచ్చనేది కేంద్రం వ్యూహం. అందుకే- దేశవ్యాప్తంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఇదివరకే శ్రీకారం చుట్టింది.ఆయా ప్రాంతాల్లో నెలకొన్న తాజా పరిస్థితులపై అధ్యయనం చేయడంతో పాటు, మావోయిస్టుల సమస్యను పరిష్కరించడానికి ముఖ్యమంత్రులు, పోలీసు ఉన్నతాధికారుల నుంచి తగిన సూచనలు, సలహాలను తీసుకోవడానికే అమిత్‌ ‌షా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం ద్వారా సమస్యకు శాశ్వతపరిష్కారం దిశగా వెళ్తున్నట్టు విశ్లేషకుల అభిప్రాయం. ఈ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌, ‌నితీష్‌ ‌కుమార్‌(‌బిహార్‌), ‌నవీన్‌ ‌పట్నాయక్‌(ఒడిశా), యోగి ఆదిత్యనాథ్‌ (ఉత్తర్‌ ‌ప్రదేశ్‌), ‌కమల్‌ ‌నాథ్‌ (‌మధ్యప్రదేశ్‌), ‌రఘుబర్‌ ‌దాస్‌ (‌జార్ఖండ్‌), ‌భూపేష్‌ ‌బఘేల్‌ (‌ఛత్తీస్‌ ‌గఢ్‌), ‌తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్‌లతో పాటు ఆయా రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
తెలంగాణలో నక్సలిజం లేదు
రాష్ట్ర హోంమంత్రి మహ్మూద్‌ అలీతెలంగాణ రాష్ట్రంలో నక్సలిజం లేదని మంత్రి మహమూద్‌ అలీ సమావేశంలో తెలిపారు. అయితే ఛత్తీస్‌గఢ్‌ ‌సరిహద్దుల్లో కొంత మేరకు నక్సలిజం ఉందని ఆయన తెలిపారు. రైతు కుటుంబాలకు చెందిన వారే ఎక్కువగా నక్సలిజంలో చేరారని ఆయన చెప్పారు. రైతుల కోసం సిఎం కెసిఆర్‌ ‌రైతు బంధు, రైతు బీమా పథకాలను అమలు చేస్తున్నారని మహమూద్‌ అలీ పేర్కొన్నారు. రైతులకు 24 గంటల కరెంట్‌ ఇస్తున్నామని చెప్పారు. దేశంలోనే తెలంగాణ నెంబర్‌ ‌వన్‌ ‌రాష్ట్రంగా అవతరించిందని ఆయన వెల్లడించారు. రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణ వస్తే నక్సలిజం పెరుగుతుందని కొందరు భయ పెట్టారని, రాష్ట్రం ఏర్పడిన అనంతరం తెలంగాణలో నక్సలిజం సమస్య లేకుండా పోయిందని ఆయన తెలిపారు. తెలంగాణ పోలీసులు బాగా పని చేస్తున్నారని ఆయన కొనియాడారు. ఈ భేటీలో తెలంగాణ తరపున మహమూద్‌ అలీ, డిజిపి మహేందర్‌ ‌రెడ్డి, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మహమూద్‌ అలీ డియాతో మాట్లాడుతూ పైవిధంగా వ్యాఖ్యానించారు.