సెకండ్‌వేవ్‌లో మరణాల సంఖ్య తీవ్రం
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా 95శాతం హాలు పూర్తి
కరోనా కష్టాల్లోనూ సంక్షేమానికి పెద్దపీట
కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి చికిత్సలకు అనుమతి
జగనన్న విద్యాదీవెన కోసం 4879.30 కోట్లు
జగనన్న వసతి దీవెనకు రూ.1049 కోట్లు
మనబడి-నాడు నేడు కింద 15717 స్కూళ్ల ఆధునికీకరణ
అమరావతి : కరోనా ప్రభావం ఆర్థిక రంగంపై తీవ్రంగా ఉందని ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా గవర్నర్ ఉభయ సభలనుద్దేశించి వర్చువల్ విధానంలో ప్రసంగించారు. కొవిడ్ మృతులకు సంతాపం తెలిపిన అనంతరం గవర్నర్ మాట్లాడుతూ.. దేశంలో కరోనా సంక్షోభం కొనసాగుతోందన్నారు. కొవిడ్‌తో పరిస్థితులు ఎలా మారాయో అందరికీ తెలుసన్నారు. సెకండ్ వేవ్‌లో మరణాల సంఖ్య ఎక్కువగా ఉందని గవర్నర్ బిశ్వభూషణ్ పేర్కొన్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు సెల్యూట్ తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా 95శాతం హాలు పూర్తి చేశామన్నారు. కరోనా సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని గవర్నర్ తెలిపారు. కరోనాను ఆరోగ్యశీలో చేర్చామన్నారు. ఆరోగ్యశ్రీకి ప్రైవేట్ ఆస్పత్రుల్లో 50 శాతం బెడ్లు కేటాయించామని వెల్లడించారు. నవరత్నాలు ద్వారా లబ్దిదారులకే నేరుగా సాయం అందుతోందన్నారు. రూ.1,600 కోట్లతో 36.8 లక్షల మందికి జగనన్న గోరుముద్ద అందిస్తామని తెలిపారు. 44.5 లక్షల మంది తల్లులకు జగనన్న అమ్మ ఒడి అందుతోందన్నారు. జగనన్న విద్యా కానుక ద్వారా 47లక్షల మందికి కిట్‌లు అందించామని గవర్నర్ బిశ్వభూషణ్ తెలిపారు. కోవిడ్‌ను ఎదుర్కోవడంలో ఏపీ.. దేశానికే ఆదర్శంగా నిలిచిందని గవర్నర్ అన్నారు. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి నుంచి కోవిడ్ సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా రోజుకు 4 లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. సెకండ్ వేవ్‌లో మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఏపీలోనూ ఉంది.
కొత్తగా కోవిడ్ సెంటర్లు ఏర్పాటు చేశాం. తి ప్రైవేట్ ఆస్పత్రిలోనూ కోవిడ్ చికిత్స కోసం ఆరోగ్యశ్రీ కింద ఏర్పాటు చేశాం. ఆక్సిజన్ కొరత లేకుండా ఇతర దేశాల నుంచీ క్రయోజనిక్ ఆక్సిజన్ తెప్పించామని గవర్నర్ తెలిపారు. ఆర్థిక వ్యవస్థపై కోవిడ్ దుష్పభ్రావం చూపినప్పటికీ సంక్షేమ పథకాలను కొనసాగించాం. ప్రజల సంక్షేమం ప్రాధాన్యతగా 95 శాతం హాలను పూర్తి చేశాం. ఇప్పటి వరకు కోటి 80 లక్షల మంది టెస్టులు చేయగా 14 లక్షల 54 వేల మందికి పాజిటివ్ వచ్చింది. ప్రతిరోజూ 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేశాం. జగనన్న విద్యాకానుక కింద 47 లక్షల మందికి విద్యాకానుక అందించాం. కరోనా ప్రభావం ఉన్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థపై ఏపీ ఆర్థిక పురోగతిని కనబరిచింది. 2020-21లో జాతీయ అభివృద్ధి రేటు నెగిటివ్ ఉండగా ఏపీ 1.58 శాతం అభివృద్ధి రేటు కనకబరిచింది. రాష్ట్రంలో 53.28 లక్షల మందికి తొలిడోసు ఇచ్చాం. 21.64 లక్షల మందికి సెకండ్ డోసు వ్యాక్సినేషన్ పూర్తయ్యిందని గవర్నర్ పేర్కొన్నారు. జగనన్న విద్యాదీవెన కోసం 4879.30 కోట్లు, జగనన్న వసతి దీవెనకు రూ.1049 కోట్లు కేటాయించాం. మనబడి-నాడు నేడు కింద 15717 స్కూళ్ల ఆధునికీకరణ చేపట్టాం.
స్కూళ్ల ఆధునికీకరణకు రూ.3,948 కోట్లు కేటాయించాం. విద్యా శాఖకు అన్ని పథకాల కింద రూ.25,714 కోట్లు కేటాయించాం. 44.5 లక్షల మంది తల్లులకు జగనన్న అమ్మఒడి వర్తింప చేశాం. జగనన్న అమ్మఒడి కింద రూ.13,022 కోట్లు, జగనన్న గోరుముద్ద కింద 36.88 లక్షల మందికి రూ.1600 కోట్లు ఇచ్చాం. ఇరిగేషన్ కింద 14 ప్రాజెక్టులు పూర్తి చేశాం. వైఎస్సార్ రైతు భరోసా, పీఎం కిసాన్ కింద 2019-20 ఏడాదికి 52.38 లక్షలమంది రైతులకు 17030 కోట్లు కేటాయించా మన్నారు. వైఎస్‌ఆర్ కాపు నేస్తంలో 40 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు వారికి కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులాల మహిళలకు 5 విడతల్లో రూ.75 వేలు. ఈ ఏడాది 3.2 వైఎస్సార్ కాపు నేస్తం కింద 491 కోట్లు కేటాయించి 3.27 లక్షల మంది మహిళలకు లబ్ది చేకూర్చాం. వైఎస్సార్ నేతన్న నేస్తం కోసం 390.74 కోట్లు కేటాయించి నేతన్నలకు 81,783 మంది లబ్ది చేకుర్చాం.
56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలను బీసీలకు వేగంగా అందించేందుకు ప్రయత్నం చేస్తున్నామని గవర్నర్ తెలిపారు. వైఎస్సార్ ఆసరా పథకం కింద 87,74,674 మంది మహిళలకు 6792.21 కోట్లు కేటాయించాం. వైఎస్‌ఆర్ సున్నా వడ్డీ కింద 8.78 లక్షల మహిళా సంఘాలకు రూ.1399.79 కోట్లు, వైఎస్సార్ చేయూత కింద 45 నుంచి 60 మధ్య ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహళలకు 4604.13 కోట్లు కేటా యించాం. పరిశ్రమల్లో 75 శాతం మంది స్థానికులకే ఉద్యోగాలు లభించేలా చట్టం చేశాం. ఒక స్కిల్ వర్శిటీతోపాటు 25 మల్టీ స్కిల్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నాం.రాష్ట్రంలోని 3 ప్రధాన ఇండస్టియ్రల్ కారిడార్లలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సహకాలు. విజయనగరంలో భోగాపురం ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేస్తున్నాం. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్‌పోర్టును ప్రారంభించాం. రాష్ట్రంలో 6 పోర్టులు, 2 ఫిషింగ్ హార్బర్లను రెండు విడతల్లో అభివృద్ధి చేస్తామని గవర్నర్ అన్నారు. కోవిడ్‌ను ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాలుగా సిద్ధంగా ఉందని గవర్నర్ తెలిపారు. ప్రజలను కోవిడ్ నుంచి కాపాడుకోవడం కోసం సర్వశక్తులను వినియోగిస్తామన్నారు. ప్రజలందరూ కోవిడ్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తున్నానన్నారు.