Take a fresh look at your lifestyle.

ఆర్టీసీ కార్మికులకు కరువైన ఆదరణ

ఆర్టీసీ కార్మికులు ఏ ముహూర్తాన సమ్మె మొదలు పెట్టారో ఏమోగాని, వారికంతా ఎదురుగాలే వీస్తున్నది. ఆర్టీసీ చరిత్రలోనే గతంలో ఎన్నడూలేని విధంగా యాభై రెండు రోజులు సమ్మెచేసినా, ఒక్కటంటే ఒక్క డిమాండ్‌ను కూడా సాధించుకోలేకపోయారు. అటు ప్రభుత్వ ఆదరణలేదు. ఇటు యాజమాన్యం ఏమీ చేయలేని పరిస్థితి. కనీసం ఉపశమనాన్ని కలుగజేస్తుందనుకుంటే తప్పంతా కార్మికులదే అన్నట్లుంది కోర్టుల వ్యాఖ్యానం. టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంపై ఇది తమకు అందివొచ్చిన అవకాశంగా ప్రతిపక్ష రాజకీయ పార్టీలన్నీ సమ్మె ‘కాడి’ని తమ భుజాలపై ఎత్తుకున్నంతసేపుకూడా మోయకుండా కిందపడేశాయి. బతుకమ్మ, దసరా, దీపావళి పండుగలకు తమ స్వగృహాలకు వెళ్ళేందుకు ప్రజలు నానా ఇబ్బందులు పడాల్సిరావడంతో కనీసం వారి నుండి కూడా కార్మికులకు అనుకున్నంతగా ఆదరణ లేకుండా పోయింది. యాభై రెండు రోజులపాటు సమ్మెను పండ్ల బిగువుతో ఏదో విధంగా లాక్కొచ్చినా ఇంకా సమ్మెను పొడిగించడం వారివల్ల కావడం లేదు. ఒకటా, రెండా, మూడు నెలలపాటు వేతనాలులేక కుటుంబాలన్నీ దీనావస్థకు చేరుకున్నాయి. చివరకు తమకు డిమాండ్లు ఏమీలేవన్న స్థాయికి దిగజారాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనిపించిన రాయికీ రప్పకు, దేవుళ్ళకు మొక్కినట్లు తమ దీనావస్థను అర్థంచేసుకోవాల్సిందిగా ఆర్టీసీ అధికారులు, పోలీసు అదికారుల కాళ్ళావేళ్ళా పడుతున్నారు. తమ సంస్థ అధికారుల వరకైనా వెళ్ళనివ్వండంటూ పోలీసుల కాళ్ళుపట్టుకుంటున్నారు. దాదాపు రెండున్నర దశాబ్ధాలుగా సంస్థలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి జీతం రాకపోవడంతో భార్యమీద గొలుసు తాకట్టుపెట్టి రోజులు వెళ్ళదీస్తున్నానంటూ, ప్రభుత్వం ఏది చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నానని, సంస్థ అధికారులతో ఒకసారి కలువనివ్వండని పోలీసు కాళ్ళ మీదపడిన తీరు అక్కడి వారికి కంటతడి పెట్టించింది. నిజామాబాద్‌లో ఓ మహిళా కండక్టర్‌ ‌డిపో మేనేజర్‌ ‌కాళ్ళమీదపడి తమను ఉద్యోగంలో తీసుకోవాలని కడు దీనంగా విలపించింది. ఖమ్మంలో మహిళా సిబ్బంది ఓ భవనంపై నుండి దూకేందుకు సిద్ధపడ్డారు. మరో మహిళ తమను పనిలోకి తీసుకోమనడం తప్ప మరే డిమాండ్‌ ‌లేదంటూ కన్నీరుమున్నీరైంది. తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలన్న బాధ కలిగిందని, కాని, ప్రభుత్వానికి విన్నవించుకుందామని తోటి ఉద్యోగులందరినీ పిలిచానంటూ ఆమె విలపించిన తీరు అక్కడున్న ఇతర మహిళా సిబ్బందికి కూడా కన్నీరుపెట్టించింది. కనిపించని భగవంతునికి గొంతెత్తి ప్రార్థించినట్లు ఇంత జరుగుతున్నా తమతో ఒక్కమాట కూడా మాట్లాడని రాష్ట్ర ముఖ్యమంత్రికి వారు రెండుచేతులు జోడించి కన్నీరుమున్నీరై విన్నవించుకుంటున్న తీరు టివీల ద్వారా వీక్షించిన వారికి కూడా కన్నీరు పెట్టించింది. డ్యూటీలో తీసుకోవడం తప్ప ఇప్పుడు వారు మరే విషయాన్ని డిమాండ్‌ ‌చేసే పరిస్థితిలోలేరు. ఆర్టీసీ ఇన్‌ఛార్జీ ఎండి సునీల్‌ ‌శర్మ చెప్పినట్లు లేబర్‌ ‌కమిషనర్‌ ‌నిర్ణయం దాకా సంయమనం పాటించే ఓపిక వారిలో లేకుండా పోయింది. ఇష్టమొచ్చినప్పుడు విధులకు గైర్హాజరై, ఇష్టమొచ్చినప్పుడు విధుల్లో చేరాలనుకుంటే ఎలా అని ఆయన ప్రశ్నించినతీరు ఇప్పటికే కృంగిపోయినవారిని కుళ్ళపొడిచినట్లుందంటున్నారు.
నేటినుండీ రెండు రోజులపాటు రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలు జరుగుతాయంటున్నారు. కనీసం ఈ సమావేశాల్లోనైనా ఆర్టీసీ కార్మికుల సమ్మె సమస్యపై పరిష్కారం లభిస్తుందో లేక ఇన్‌ ‌చార్జీ ఎండి అన్నట్లు లేబర్‌ ‌కమిషనర్‌ ‌నిర్ణయం తర్వాతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. నిన్న మొన్నటి వరకు సమ్మె ఉధృతంగా ఉన్నంతవరకు, కొందరు అధైర్యపడి ఆత్మహత్యలకు పాల్పడినా, కార్మికులంతా తమకు ఏదో న్యాయం జరుగకపోదన్న భరోసాతో ఉన్నారు. కాని,ఆత్మహత్యలకు, మరణాలకు ప్రభుత్వమే కారణమని ఎలా చెబుతారని, కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే యూనియన్‌ ‌నాయకులు ఏంచేస్తున్నారంటూ కోర్టు ప్రశ్నించిన తీరు కార్మికుల్లో ఆవేదన కలిగించింది.,ఈ విషయంలో కార్మికులతో చర్చలు జరుపాలని సూచించగలమేగాని, ప్రభుత్వాన్ని ఆదేశించలేమన్న కోర్టు వ్యాఖ్యలు కూడా వారిని నిరాశపర్చాయి. కేంద్ర ప్రభుత్వం కూడా చేతులెత్తేసింది. సంస్థ నష్టాలను తాము భరించే ప్రరిస్థితి లేదని కాంగ్రెస్‌ ఎం‌పీలకు కేంద్రం చెప్పేసింది. దీనితో కేంద్రం జోక్యం చేసుకుంటుందని ఇంతకాలం రాష్ట్ర బిజెపి నాయకులు చెబుతూ వస్తున్నదానికి ఫుల్‌స్టాప్‌ ‌పెట్టినట్లైంది. ఇప్పుడు ప్రభుత్వాన్ని వేడుకోవడం మినహా వారివద్ద మరో ప్రత్యమ్నాయం లేకుండా పోయింది. కార్మికులు తమకు ఇంత దీనస్థితి వస్తుందని కలలోకూడా ఊహించి ఉండరు. ఏ ముహూర్తాన సమ్మె ప్రారంభించారో ఏమో…

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy