వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

‘ఆరోగ్యం’ బాగలేదు..!

September 5, 2019

అచ్చిరాని మంత్రిత్వ శాఖ..సర్వత్రా ఆసక్తికర చర్చ 

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్ : అదేందోగానీ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిత్వ శాఖ చేపట్టిన వారికెవ్వరికీ కలిసి రావడం లేదా..? వరుస పరిణామాలు చూస్తుంటే అవుననిపించకమానదు. అవి యాధృచ్ఛికమై ఉండుగాక.. కానీ పరిస్థితులు చూసినప్పుడు అలాంటి సెంటిమెంట్‌ ‌ముద్ర పడిపోయేలా కూడా కనిపిస్తోంది. 2014లో టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. అప్పటి డిప్యూటీ సీఎంగా ఉన్న రాజయ్య.. వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి పోర్ట్ ‌ఫోలియోను కూడా నిర్వహించారు. అయితే రాజయ్యపై, ఆయన దగ్గరున్న కొందరు అధికారులపై అవినీతి, అక్రమాల ముద్ర పడటంతో.. రాజయ్యను డిప్యూటీ సీఎంగా, వైద్య, ఆరోగ్యశాఖా మంత్రిగా పక్కనబెట్టేశారు.  రాజయ్యను ఆ పదవుల నుంచి పక్కన పెట్టేందుకే.. ఆయనపై ఉన్న అవినీతి ఆరోపణలను మరింత బలంగా జనంలోకి తీసుకెళ్లి.. వ్యూహాత్మకంగా వేటు వేశారనే వాళ్లూ లేకపోగా.. ఈమధ్య అలాంటి పోస్టింగ్స్
‌వాట్సప్‌, ఎఫ్‌బీల్లో చక్కర్లు కూడా కొట్టాయి. ఆ తర్వాత అదే వైద్య, ఆరోగ్య శాఖా మంత్రిగా లక్ష్మారెడ్డి పగ్గాలు చేపట్టారు. అయితే లక్ష్మారెడ్డి కేసీఆర్‌ ‌గుడ్‌ ‌లుక్స్‌లో లేకనో.. లేక ఆయన్ను పక్కన పెట్టినా పోయేదేంలేదనే భావనో లేక సామాజిక సమీకరణాలో.. మొత్తమ్మీద ఆయనకు రెండోసారి మళ్ళీ టీఆర్‌ఎస్‌ అధికారంలోకొచ్చాక  క్యాబినెట్‌లో బెర్త్ ‌దక్కలేదు. గత క్యాబినెట్‌లో ఉన్న ఇంద్రకరణ్‌ ‌రెడ్డి, ఈటల, మహమూద్‌ అలీ.. ఇలా ఎందరికో క్యాబినెట్‌ ‌బెర్తులు రెండోసారి అధికారంలోకొచ్చాక దక్కినా.. కేటీఆర్‌, ‌హరీష్‌ ‌లాంటీవాళ్లకే మంత్రి పదవులు దక్కపోవడంతో ఫోకసంతా వారిపైనే అయిందే తప్ప లక్ష్మారెడ్డికి మంత్రి పదవి దక్కకపోవడంపై పెద్దగా చర్చ జరుగలేదు. అయితే.. రాజయ్య, లక్ష్మారెడ్డి నిర్వర్తించిన వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి పదవిని ప్రస్తుతం గత క్యాబినెట్‌లో ఆర్థికమంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్‌ ‌నిర్వర్తిస్తుండగా ఇప్పుడు తాజాగా జరుగుతున్న పరిణామాలతో అసలు ఆరోగ్యశాఖ చేపట్టినోళ్లకెవ్వరికీ అది అచ్చిరావడంలేదని.. వారి కెరీర్‌లోనే అనేక అనారోగ్య పరిస్థితులు తలెత్తుతున్నాయనే చర్చ మొదలైంది. ఈమధ్య రెవెన్యూశాఖపై జరిగిన కలెక్టర్ల సదస్సు వివరాలన్నీ మంత్రి ఈటల రాజేందర్‌ ‌ద్వారా బయటకు పొక్కాయంటూ..ఓ రెండు పత్రికలు రాసిన సంచలన కథనాలు.. ఆ తర్వాత వరుసబెట్టి ఇతర మీడియాలో కొనసాగింపుగా సాగిన వార్తలు.. ఆ తర్వాత ఈటల ఖండన.. మూడురోజుల క్రితం హుజూరాబాద్‌లో భావోద్వేగంతో ఆయన చేసిన కామెంట్స్.. ‌వెంటనే వివరణ ఇచ్చుకున్న తీరుతో అసలేం జరుగుతోందన్న గందరగోళం నెలకొంది. పైగా ఈటలపై వచ్చిన కథనాలు.. ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న ఓ రాజ్యసభ సభ్యుడి కనుసన్నల్లో నడుస్తున్న పత్రికలో రావడంతో.. ప్రతిపక్షాలకూ అస్త్రం దొరికినట్టైంది. మిడ్‌ ‌మానేరు నిర్వాసితుల సభా వేదికగా.. ఎంపీ బండి సంజయ్‌ ‌దమ్ముంటే ఈటల రాజీనామా చేసి బయటకు రావాలని సవాల్‌ ‌విసరగా.. ఎంపీ రేవంత్‌ ‌రెడ్డి మరో రెండాకులెక్కువన్నట్టు అంతలోనే అబ్బో అనిపించిన ఈటెల.. ఆయింతలోనే కేటీఆర్‌ ‌ఫోన్‌ ‌కాల్‌తో తుస్సుమనిపించాడంటూ చేసిన వ్యాఖ్యలు.. కరీంనగర్‌ ‌పౌరుషం చచ్చిపోయిందా అంటూ పరుషంగా మాట్లాడిన పరిస్థితి నెలకొంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా ఉమ్మడి కరీంనగర్‌ ‌జిల్లాలో ఆసుపత్రుల పరిశీలనకు వచ్చి.. మీ పార్టీలో విభేదాలు వైద్య, ఆరోగ్యశాఖఫై పడకుండా చూసుకోండని.. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఇలాఖాలోనే పెద్దాసుపత్రులకు సుస్తైందని చేసిన వ్యాఖ్యలతో.. ఓవైపు మీడియా కథనాలు, ఇంకోవైపు ప్రతిపక్షాల విమర్శలతో ఉక్కిరిబిక్కిరైన ఈటల రాజేందర్‌ ఈ ‌మధ్య ప్రతీ కార్యక్రమంలోనూ ముభావంగానే కనిపిస్తున్నారు.  ఇదే క్రమంలో ఈటల మంత్రి పదవి ఔటంటూ కూడా పతాకశీర్షికలకెక్కడంతో… అసలు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిత్వ బాధ్యతలు చేపట్టినవారికి.. ఆ శాఖ అచ్చిరావడంలేదా..? లేక ఇదంతా యాధృచ్ఛికంగానే జరుగుతుందా ఆనే చర్చ ఊపందుకుంటోంది. అయితే సెంటిమెంటల్‌గా వైద్య, ఆరోగ్యశాఖపై ఈ ముద్రపడితే మాత్రం.. మున్ముందు ఈ శాఖ పగ్గాలు చేపట్టాలంటే కూడా ఇతరులు జంకే పరిస్థితి నెలకొంటుందంటున్నారు కొందరు విశ్లేషకులు.