వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

అసెంబ్లీ తీర్మానం సరే…ఇచ్చిన అనుమతులు…?

September 18, 2019

పర్యావరణాన్ని, జీవావరణాన్ని, ప్రకృతి రమణీయతను ప్రస్తావిస్తూ సువిశాల నల్లమల్ల అడవులలో యురేనియం నిక్షేపాల వెలికితీత తవ్వకాలు కేంద్రం ఉపసంహరించుకోవాలని తెలంగాణ శాసన సభ తీర్మానం చేయడం, ఒకవేళ కేంద్రం తమపై ఒత్తిడి చేస్తే అన్ని పార్టీలతో కలిసి సమిష్టిగా యురేనియంకు వ్యతిరేకంగా పోరాడుదాం అనడం ఆహ్వానించదగ్గ పరిణామమే. కానీ ఈ తీర్మానం అనంతరం ఇంకా నల్లమల్లలో ‘అణు భయం’ పోలేదు. అసెంబ్లీ తీర్మానం చేసినంత మాత్రాన అణుముప్పు ప్రక్కకు తప్పినట్లుగా భావించడం లేదు. ఎందుకుంటే 2015-16 స్టేట్‌ ‌ఫారెస్ట్ అడ్వైజరి కమిటీ మరియు రాష్ట్ర వైల్డ్ ‌లైప్‌ ‌కమిటీ ఇచ్చిన అనుమతులు అలానే ఉన్నవి.1987 నుంచి నల్లమల్ల నల్లగొండలో యురేనియం త్రవ్వకాలకు సంబంధించి కేంద్రం అనుమతులు కోరడం, రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం, సర్వేలు చేయడం, శాంపిల్స్ ‌సేకరించడం, త్రవ్వకాలకు ప్రయత్నించడం జరుగుతూనే ఉన్నవి. కాని ప్రజాపోరాటాల రీత్యా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెనుకకు తగ్గినట్లు తగ్గడం, ప్రభుత్వాలు మారడం, సమయం వచ్చినప్పుడల్లా మళ్ళీ కొత్తగా అనుమతులు కోరడం, ప్రాంతీయ ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వడంతో పాటు నల్లమల్లను ఆగం చేయడానికి పూనుకోవడం అనేది తెలంగాణ నేలపై మూడు దశాబ్దాలకు పైగా జరుగుతున్న తతంగమే. యురేనియం అనే పెనుభూతం పేరు విన్నప్పుడల్లా నల్లమల్లను కాపాడుకోవడానికి ప్రజలు చేస్తున్న ఉద్యమాలు వెల్లకట్టలేనివి. వారికి పౌరసమాజం అందిస్తున్న సహకారం చాలా ఉన్నతమైనది. ఆ పోరాటాల ద్వారా వచ్చిన చట్టాలు శాస్త్రీయమైనవి. ఇవన్నీ వున్నా యురేనియం వెలికితీతపై పాలకులకు ఆసక్తి తగ్గడం లేదు. ఈ పరిణామక్రమంలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత అధికారంలోకి తెరాస వొచ్చిన తర్వాత యురేనియం మైనింగ్‌ ‌కోసం 2014-15 లో కేంద్రం, రాష్ట్రాన్ని అనుమతులు కోరడం ఆ సమయంలో మోడికి, కెసిఆర్‌కు ఉన్న సాన్నిహిత్యం కావచ్చు, కొత్త రాష్ట్ర ఏర్పాటు కాబట్టి సంపదను పోగు చేసుకోవడానికే కావచ్చు లేదా దీని వెనుకాల ఏదైనా రాజకీయ ఉద్దేశ్యం వుండి ఉండవచ్చు, మొత్తానికి రాష్ట్ర అటవీ సలహా కమిటి చైర్మన్‌గా ఉన్న ముఖ్యమంత్రి గారితో కూడిన కమిటి ప్రజాభిప్రాయాన్ని, వారి ఆకాంక్షలను, గత పోరాటాలను పరిగణనలోనికి తీసుకోకుండా, తాము కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములైన సంగతి మరిచి సడి సప్పుడు కాకుండా యురేనియం త్రవ్వకాలను 83 చ।।కీ.మీ. మేర నల్లమల్లలో జరుపుకోవచ్చని తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి అనుమతులు ఇచ్చింది. ఇది ఇలా ఉంటే అడవిని, అడవి సంపదను, వన్యమృగాలను కాపాడడానికి ఉన్న అటవీ అధికారులు అటవీ సంపదను కాపాడవలసింది పోయి యుసిఐఎల్‌ ‌తాయిలాలకు తలొగ్గి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులిస్తే ఈ నల్లమల్ల తల్లి గుండెలపై గునపాలు దించి యురేనియం మైనింగ్‌ ‌చేసుకోవచ్చని ఫీల్డ్ ఇన్‌స్పెక్షన్‌ ‌చేసి నివేదికలు ఇవ్వడమంతా అమానవీయత మరొక్కటి ఉండకపోవచ్చు. 2016లో నల్లమల్ల పారెస్ట్‌లో ఇదే జరిగింది. అందుకే ఇక్కడి ప్రజలు గత రెండు మూడు నెలల నుంచి అటవీ అధికారులను ఆఫీసులు ఖాళీ చేసి పొమ్మని హుకుం జారి చేస్తున్నారు. మా అడవిని, వన్యమృగాలను ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసని, అడవిని చిన్నాభిన్నం చేసే పారెస్ట్ ఆఫీసర్లు మాకు అవసరం లేదని వాదిస్తున్న పరిస్థితి. ఈ పరిణామాలను చూస్తుంటే ప్రజావా దనలో వాస్తవికత ఉందని అర్థమవుతుంది.
గత కొంత కాలంగా ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, రచయితలు, సినీ నటీనటులు, కవులు, కళాకారులు, పత్రికలు, సామాజిక మాధ్యమాలు భిన్న రూపాలలో కొనసాగించిన పోరాటానికి గత ప్రభుత్వాల మాదిరిగానే తెరాస ప్రభుత్వం కూడా దిగిరాక తప్పలేదు, అసెంబ్లీ తీర్మానం చేయక తప్పలేదు. పర్యావరణాన్ని, జీవావరణాన్ని, ప్రకృతి రమణీయతను ప్రస్తావిస్తూ సువిశాల నల్లమల్ల అడవులలో యురేనియం నిక్షేపాల వెలికితీత తవ్వకాలు కేంద్రం ఉపసంహరించుకోవాలని తెలంగాణ శాసన సభ తీర్మానం చేయడం, ఒకవేళ కేంద్రం తమపై ఒత్తిడి చేస్తే అన్ని పార్టీలతో కలిసి సమిష్టిగా యురేనియంకు వ్యతిరేకంగా పోరాడుదాం అనడం ఆహ్వానించదగ్గ పరిణామమే. కానీ ఈ తీర్మానం అనంతరం ఇంకా నల్లమల్లలో ‘అణు భయం’ పోలేదు. అసెంబ్లీ తీర్మానం చేసినంత మాత్రాన అణుముప్పు ప్రక్కకు తప్పినట్లుగా భావించడం లేదు. ఎందుకుంటే 2015-16 స్టేట్‌ ‌ఫారెస్ట్ అడ్వైజరి కమిటీ మరియు రాష్ట్ర వైల్డ్ ‌లైప్‌ ‌కమిటీ ఇచ్చిన అనుమతులు అలానే ఉన్నవి. అందుకే యుసిఐఎల్‌ ‌సంస్థ ఎప్పుడు వచ్చి తమ చెంచు పెంటలపైన పడుతయో అనే అయోమయంలో గిరిజన ఆదివాసి ప్రజలు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అన్ని రకాల అనుమతులను రద్దుచేసు కుంటూ స్టేట్‌ ‌ఫారెస్ట్ అడ్వైజరీ కమిటి తీర్మానం చేస్తే తప్ప రాష్ట్ర ప్రభుత్వంపట్ల ప్రజలకు భయాందోళనలు పోయే అవకాశం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ తక్షణ కర్తవ్యాన్ని పూర్తి చేసి నల్లమల్ల ప్రజలకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. ఇంతటితోనే కాకుండా ఇదే ఉద్యమ స్ఫూర్తితో అందరము కలిసి నల్లమల్ల పరిరక్షణ కోసం, గిరిజన, ఆదివాసి అభివృద్ధి కోసం పునరంకితం కావల్సిన అవసరం ఉంది.
పందుల సైదులు
తెలంగాణ విద్యావంతుల వేదిక,
9441661192