నంద్యాల,అగస్టు 11 : ఆర్థిక నేరాల్లో ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డిని పీఏసీ సభ్యుడిగా నియమించడమేంటని మాజీమంత్రి ఎన్ఎండీ ఫరూక్ ప్రశ్నించారు. బుధవారం ఆయన డియాతో మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ, వైసీపీ ప్రభుత్వాల మధ్య ఉన్న చీకటి ఒప్పందాలకు.. నిదర్శనంగా విజయసాయికి పదవి ఇచ్చారని విమర్శించారు. రేపో, మాపో సీబీఐ కోర్టులో హాజరు కాబోతున్న వ్యక్తిని.. పీఏసీలో నియమించి కేంద్ర పెద్దలు ఏం చెప్పదలుచుకున్నారని ఎన్ఎండీ ఫరూక్ నిలదీశారు.
కేంద్ర ప్రభుత్వ ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) సభ్యుడిగా ఎంపీ విజయసాయిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. రాజ్యసభ నుంచి గతంలో పీఏసీ సభ్యులుగా వ్యవహరించిన భూపేందర్యాదవ్, రాజీవ్ చంద్రశేఖర్ కేంద్ర మంత్రులుగా నియమితులు కావడంతో వారి స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ రెండు స్థానాలకు నామినేషన్లు ఆహ్వానించగా.. విజయసాయిరెడ్డితోపాటు బీజేపీ ఎంపీ డాక్టర్ సుధాంశు త్రివేది నామినేషన్లు దాఖలు చేశారు. ఇతరులెవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో వీరిద్దరూ పీఏసీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాజ్యసభ సెక్రటరీ జనరల్ దేష్దీపక్ వర్మ ప్రకటించారు.