అర్థరాత్రి అనూహ్య పరిణామాలు

ఉద్యమ పార్టీకి ఎదురీత మొదలైంది. ఆ పార్టీ ఇరవై నాలుగేళ్ళ ప్రస్తానంలో పదేళ్ళ పాటు ఏక ఛత్రాధిపత్యంగా ఏలిన బిఆర్ఎస్‌కు ఇప్పుడు పెను సవాళ్ళు ఎదురవుతున్నాయి. తమ పార్టీని బలపర్చుకునేందుకు గతంలో తాము చేసిన ఎత్తుగడలే రివర్స్‌లో తమకు ఎదురవుతుండడంతో దిక్కుతోచని పరిస్థితిలో నాయకత్వం కొట్టుమిట్టాడుతున్నది. ఉద్యమకారులను కాదని, ఇతర పార్టీల నుండి వలసలను ప్రోత్సహిస్తే, కష్టకాలంలో పార్టీని నిర్దయగా వదిలి వెళ్తున్న నాయకులను కట్టడి చేయలేని పరిస్థితిలో ఇప్పుడు ఆ పార్టీ ఉంది. అందుకు స్వయంకృత అపరాధాలు అనేకం ఉన్నాయన్న విషయాన్ని ఇటీవల అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మీడియాలో అనేక చర్చలు జరిగిన విషయం తెలియంది కాదు. పార్టీ నేతలను ఆఖరు కు మంత్రులకు కూడా అధినేత అపాయింట్‌మెంట్‌ ‌దొరకని స్థితిలో తాము పార్టీ మారక తప్పటం లేదని ఇతర పార్టీల కండువాలు కప్పుకున్న నేతలు గోడువెళ్ళబోసుకున్న విషయం తెలియంది కాదు.

అధికారంలో ఉండగానే అలాంటి స్థితి ఉన్నప్పుడు, అధికారాంతంలో పరిస్థితిని ఊహించుకోవొచ్చు. అదొక్కటే కాదు. కేంద్ర రాష్ట్ర సంబంధాలు దెబ్బతినడం, కేంద్రం నుండి రావాల్సిన నిధులను, పథకాలను రాబట్టుకోలేకపోవడం పైగా అనేక అవినీతి ఆరోపణలు పార్టీ క్యాడర్‌ను ఆయోమయంలో పడేసింది. అసెంబ్లీలో ఎన్నికల్లో ఓటమి, పార్లమెంటు ఎన్నికల్లో జీరో ఫలితాలను సాధించడంతో ఒక్కొక్కరుగా తమ రాజకీయ భవిష్యత్‌ను వెదుక్కోవటం ప్రారంభించారు. ముందుగా నలుగురు, ఆ తర్వాత ఇద్దరు కలిసి ఆరుగురు ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు పార్టీని వీడిపోయారు.

కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్‌, ‌దానం నాగేందర్‌, ‌కాలె యాదయ్య, సంజీవ్‌కుమార్‌ ‌చివరగా ఎంతో నమ్మకంగా ఉన్న మాజీ స్పీకర్‌ ‌బాన్సువాడ ఎమ్మెల్యే‌ పోచారం శ్రీనివాసరెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరిపోయారు. పార్టీలో ఉన్నత హోదా కల్పించినప్పటికీ సొంత గూటికి చేరుకోవడంతో స్వాతంత్య్రం వొచ్చినట్లుందన్న రాజ్యసభ సభ్యుడు కె. కేశవ రావు కూడా వెళ్ళడం ఆ పార్టీని మరింత కుంగదీసింది. వెళ్ళిన వారు వెళ్ళినా ఉన్నవారినైనా పార్టీ కాపాడుకోగలుగుతున్నదా అంటే గురువారం అర్ద రాత్రి టార్చ్‌లైట్‌ ‌వెలుగులో సిఎం రేవంత్‌రెడ్డిని వెతుక్కుంటూ ఆరుగురు బిఆర్ఎస్‌ ఎమ్మెల్సీ లు కాంగ్రెస్‌ ‌కండువ కప్పుకోవడం బిఆర్ఎస్‌కు ఏమాత్రం మింగుడు పడని విషయం. కనీసం సూచన ప్రాయంగానైనా వీరు పార్టీ మారుతున్న విషయం మూడవ కంటికి కూడా తెలియకుండా అంత గుట్టు చప్పుడు కాకుండా అయిపోయింది.

ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వరంగల్‌ ‌పర్యటనలో బస్వరాజు సారయ్య, బండా ప్రకాశ్‌లు అక్కడ ప్రత్యక్ష మవడం కొంత ఉప్పు అందించినట్లు అయింది కాని ఒకేసారి ఆరుగురు ఎమ్మెల్యే లు పార్టీ ఫిరాయిస్తారని బిఆర్ఎస్‌ అధిష్టానం ఊహించి ఉండదు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యతోపాటు అర్ద రాత్రి దిల్లీ నుండి రేవంత్‌ ‌రెడ్డి వొచ్చే వరకు కాపు కాసి పార్టీ కండువ కప్పించుకున్న వారిలో ఆదిలాబాద్‌, ‌కరీంనగర్‌, ‌రంగారెడ్డి జిల్లాల లోకల్‌ ‌బాడి ఎమ్మెల్సీ లు దండె విఠల్‌, ‌తానిపర్తి భాను ప్రసాద్‌, ఎంఎస్‌ ‌ప్రభాకర్‌, అలాగే గవర్నర్‌ ‌కోటాలో ఎన్నుకోబడిన ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్‌తో పాటు ఎమ్మెల్యే‌ కోటా ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేషంలు కాంగ్రెస్‌ ‌కండువను కప్పించుకున్నారు. ఒక పక్క బిఆర్ఎస్‌ ‌పార్టీ దిద్దుబాటు కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న క్రమంలోనే ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. త్వరలోనే బిఆర్ఎస్‌కు మంచి రోజులు వొస్తాయి.

ఎవరూ అధైర్య పడ వొద్దు.. ఆరు నెలల కాలంలోనే కాంగ్రెస్‌పైన అప్పుడే ప్రజలకు ముఖం మొత్తింది లాంటి అనునయం మాటలు ఎన్ని చెప్పినా నాయకులు మాత్రం తమ భవిష్యత్తే ముఖ్యమన్న ధోరణిలో తమకు నచ్చిన పార్టీల్లోకి వలసలు ప్రారంభించారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పదేళ్ళు అధికారంలో ఉన్న బిఆర్ఎస్‌ ఓటమి చవి చూసినా, శాసన మండలిలో తనకున్న బలంతో పార్టీ మనుగడను కాపాడుకోవచ్చనుకుంది. అదే సమయంలో మండలిలో తమ బిల్లుల ఆమోదం విషయంలో బిఆర్ఎస్‌తో ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన రేవంత్‌ ‌సర్కార్‌ ‌మండలిలో తన సంఖ్యను పెంచుకునే విధంగా పావులు కదుపడమే ఆరుగురు ఎమ్మెల్సీ లు కట్టకట్టుకుని ఆర్థరాత్రి పార్టీ ఫిరాయించడానికి కారణంగా మారింది. మండలిలో బిఆర్ఎస్‌ ‌బలం 25 కాగా, కాంగ్రెస్‌కు నలుగురు మాత్రమే ఉన్నారు.

కాగా ఎంఐఎంకు ఇద్దరు, బిజెపికి ఒక్కరు, టీచర్‌ ఎమ్మెల్సీ ఒకరున్నారు. తాజా పరిణామలతో బిఆర్ఎస్‌ ‌సంఖ్య 19కి పడిపోగా, కాంగ్రెస్‌ ‌సంఖ్య పదికి పెరిగింది. కాంగ్రెస్‌ ఈ ‌సంఖ్యను మరింత పెంచుకునే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తున్నది. అలాగే అసెంబ్లీలో కూడా బిఆర్ఎస్‌కున్న 39 మందిలో ఇప్పటి వరకు ఆరుగురు కారు దిగడంతో ఆ సంఖ్య 33కు చేరుకుంది. అయితే ఇక్కడ కూడా దాదాపు ఇరవై మంది ఎమ్మెల్యేలు ఒకేసారి కాంగ్రెస్‌ ‌తీర్థం పుచ్చుకునే విధంగా ఏర్పాట్లు జరుగతున్నట్లు వార్తలు కోడై కూస్తున్నాయి. ఈ క్రమంలో రాబోయే ఎన్నికల నాటికి బిఆర్ఎస్‌ ‌పరిస్థితేమిటన్నది వెయ్యి డాలర్ల ప్రశ్నగా మిగిలింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page