‘‘కళాశాలకు సరిగా రాని విద్యార్థులకు పరీక్షా సమయంలో కూడా వారి ద్వితీయ భాష పేపర్ ఏమిటో వాళ్లకే తెలియదు. విద్యార్థుల అనుమతి లేకుండానే అక్కడ అధ్యాపకులే విద్యార్థులను పంచుకోవాలి. భాషాపండితుల పరిస్థితి ఇంతకు దిగజారిపోయింది. సంస్కృత భాష పుస్తకం మరియు పరీక్షా విధానం మూల్యాంకనం ఇవన్నీ చాలా సులువుగా ఉంటాయి. తెల్ల కాగితాన్ని నల్లగా మారిస్తే ఎర్ర పెన్నుతో మార్కుల వర్షాన్ని కురిపిస్తున్నారు. ప్రతి విద్యార్థికి 90నుండి 99 శాతం మార్కులు వేస్తారు. కష్టపడకుండానే అన్ని మార్కులు అప్పనంగా వస్తాయని విద్యార్థులందరూ సంస్కృత భాష వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఈ పరిస్థితి ఈ విధంగా కొన సాగితే రానురాను ప్రభుత్వ కళాశాలల్లో తెలుగు భాష కనుమరుగయ్యే అవకాశం అత్యంత చేరువలో ఉన్నట్లే.’’
ఉగ్గుపాలతో రంగరించి అమ్మ నేర్పిన భాష నేడు విషపు కోరల్లో చిక్కునుంది. మాతృభాషను అమ్మ భాష, అమృత అని ప్రపంచ వ్యాప్తంగా తెలుగు మహా సభలు పెట్టి గొంతెత్తి చాటిచెప్పిన మన ప్రభుత్వం ఇప్పుడు తెలుగు భాష ఉనికినే దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది.
నోటితో పొగిడి-నొసటీతో వెక్కిరించినట్లు
రాష్ట వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ద్వితీయ భాషగా సంస్కృతాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించడం తెలుగు భాషకు వెన్నుపోటు పొడవడమే. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అమ్మ భాష పరాయి భాష కానుంది. సంస్కృత భాష రాజ భాష. మేము దానికి వ్యతిరేకం కాదు.ఆ భాషను కించపరచడం మా ఉద్దేశం కాదు. సంస్కృత భాషను బ్రతికించాలి అనుకుంటే వాటికోసం ప్రత్యేకంగా వేద పాఠశాలలు నెలకొల్పండి. ప్రత్యేక కార్యక్రమాలు పెట్టి సంస్కృత భాష ఉనికిని కాపాడండి. కానీ ప్రభుత్వ కళాశాలల్లో తెలుగు భాషకు పోటీగా సంస్కృత భాష ను ప్రవేశపెట్టవద్దని పెద్దలకు మనవి చేస్తున్నాం.
ఇప్పటికే విద్యార్థులను వెతికి వెతికి బుజ్జగించి ప్రభుత్వ కళాశాలల్లో చేర్పించే పరిస్థితి నెలకొంది. అరకొర సంఖ్యలో ఉన్న విద్యార్థుల కు ద్వితీయ భాషగా తెలుగు, హిందీ, సంస్కృతం, పెడితే విద్యార్థులు ఏది చదవాలో తెలియక అయోమయానికి గురి అయ్యే పరిస్థితి. కళాశాలకు సరిగా రాని విద్యార్థులకు పరీక్షా సమయంలో కూడా వారి ద్వితీయ భాష పేపర్ ఏమిటో వాళ్లకే తెలియదు. విద్యార్థుల అనుమతి లేకుండానే అక్కడ అధ్యాపకులే విద్యార్థులను పంచుకోవాలి. భాషాపండితుల పరిస్థితి ఇంతకు దిగజారిపోయింది. సంస్కృత భాష పుస్తకం మరియు పరీక్షా విధానం మూల్యాంకనం ఇవన్నీ చాలా సులువుగా ఉంటాయి. తెల్ల కాగితాన్ని నల్లగా మారిస్తే ఎర్ర పెన్నుతో మార్కుల వర్షాన్ని కురిపిస్తున్నారు. ప్రతి విద్యార్థికి 90నుండి 99 శాతం మార్కులు వేస్తారు. కష్టపడకుండానే అన్ని మార్కులు అప్పనంగా వస్తాయని విద్యార్థులందరూ సంస్కృత భాష వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఈ పరిస్థితి ఈ విధంగా కొన సాగితే రానురాను ప్రభుత్వ కళాశాలల్లో తెలుగు భాష కనుమరుగయ్యే అవకాశం అత్యంత చేరువలో ఉన్నట్లే. ఏ ఉద్యోగ నియామకాన్ని కైనా ఏ అభ్యర్థన కొరకైనా ఉత్తర ప్రత్యుత్తరాలు రాయాలంటే తెలుగులోనూ, ఇంగ్లీషులోనూ, హిందీలోనూ రాస్తారు. సంస్కృతంలో రాయలేరు కదా. వాడుక భాషకు గాని పోటీపరీక్షలకు గాని విద్యార్థులకు ఏమైనా ఉపయోగం ఉందా….. విద్యార్థికి ఏ విధంగానూ ఉపయోగపడని సంస్కృతభాషను ప్రవేశపెట్టడంలో ఆంతర్యము ఏంటో….. ఎవరికి ప్రయోజనం.
ఇప్పటికే విద్యార్థుల్లో మాతృభాషపై పట్టుసడలిందనీ చదవడంలో రాయడంలో వెనకబడి పోతున్నారని విద్యార్థులకు పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూనే వెనకనుండి సంస్కృతభాషను ప్రోత్సహించి తెలుగుభాషకు వెన్నుపోటు పొడిచి భాషా ఔన్నత్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం గట్టిగా జరుగుతుంది.ఏ భాషలలోను సరైన పట్టు సంపాదించ కుండా విద్యార్థుల భవితవ్యాన్ని అగమ్యగోచరంగా మార్చకండి. తెలుగు భాషాభిమానులను మనోవేదనకు గురి చేయకండి. లిఅసలు అడుగు బట్టి -తాలుపైకి లేచినట్లులి మాతృభాష అడుగంటి పోనుంది. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది మాతృభాష. కవుల కళాకారుల గొంతులే ఆయుధంగా రాష్ట్ర సాధనలో మాతృభాష ముఖ్య భూమిక పోషించింది. మనస్ఫూర్తిగా మాట్లాడాలన్నా కష్టసుఖాలను పంచుకోవాలన్న అది మాతృభాష తోనే సాధ్యం. మాతృభాష తల్లిపాల వంటిది పరాయి భాష పోత పాల వంటిదిలిలిఅని కొమర్రాజు లక్ష్మణరావు గారు అన్నట్లు ఉగ్గుపాల భాష నాన్న చిటికెన వేలు పట్టి బుడిబుడి అడుగులు వేస్తూ నేర్చుకున్న భాష మాతృభాష. అది మన వారసత్వ భాష.
తెలుగు భాష పై విద్యార్థులకు మమకారం ప్రేమ ఏర్పడాలంటే తెలుగు పాఠ్య పుస్తకాలను సులభతరం చేయాలి. ప్రతీ పాఠ్యాంశం లో ముఖ్యమైన పద్యాల మరియు ప్రశ్నల సంఖ్యను తగ్గించాలి.గ్రాంధిక పదజాలం రాకుండా చూడాలి. విద్యార్థుల మానసిక పరిజ్ఞానానికి తగ్గట్టుగా పాఠ్యాంశాల పుస్తకాలు ప్రచురించాలి. పరీక్ష పత్రాలను రూపొందించడంలో కూడా సమూలమైన మార్పులు చేయాలి.పరీక్షా పత్రాలు మూల్యాంకనం చేసేటప్పుడు తెలుగు లో 99 మార్కులు వేస్తే ఆ జవాబుపత్రంAE నుండి CEనుండి సబ్జెక్ట్ ఎక్స్పెక్ట్ వరకు కూడా మూడు సార్లు మూల్యాంకనం చేసి99 మార్కులు కాస్త చిన్న చిన్న కారణాలతో 90కి80 కి మార్కులను తగ్గించడం వల్ల విద్యార్థులకు మాతృ భాషపై అభిమానం చచ్చిపోతుంది. భాషపైన వెగటు పుడుతుంది.ఎంత చదివినా మంచి మార్కులు రావని ఉద్దేశంతో విద్యార్థులు సంస్కృతాన్ని ఎంచుకునే అవకాశం ఉంది. చిన్నప్పటినుండి చదివిన మాతృభాషలో తక్కువ మార్కులు వస్తున్నాయి.పది నెలల్లోనే చదివిన సంస్కృత భాషలో మార్కులు 99% వస్తున్నాయంటే ఆ భాష పాఠ్య పుస్తకాలు మూల్యాంకన విధానం ఎంత సులభంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
ఏ భాష అయినా కొంత కాలం వాడుకలో లేకపోతే ఆ భాష అంతరించిపోయే అవకాశం ఉంటుంది. అంతరించిపోయే భాషల్లో తెలుగు ముందువరుసలో ఉందని యునెస్కో వెల్లడించింది. ఒక భాష నశిస్తే ఆ భాషలో ఉన్న అపారమైన విలువలు, జ్ఞానసంపద సంస్కృతి అంతా అంతా నశించి పోతుంది. చంద్రబోస్ లాంటి సినీ కవులు కూడా భాషా మాధుర్యాన్ని వారి పాటల ద్వారా మాటల ద్వారా భాషా సౌందర్యాలను పరిమళాలను వెదజల్లుతూ ఉన్నారు.
ఊట చెలిమే లాంటి మాతృభాష అమృతభాండం లో విషయాన్ని చిమ్మే ప్రయత్నం జరుగుతుంది. కవులు కళాకారులు భాషా సంఘాలు విద్యావేత్తలు మేధావులు ఆలోచించి మాతృభాష కు జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ ఊరుకోకుండా ప్రభుత్వ కళాశాలలో సంస్కృత భాషను ప్రవేశపెట్టాలి అనే ప్రభుత్వ నిర్ణయాన్ని మానుకోవాలని పెద్దలకు విన్నవిద్ధాం . తెలుగుభాష ఉనికిని కాపాడుతూ తెలుగు భాష గొప్పతనాన్ని మాధుర్యాన్ని తరువాతి తరాలకు అందించే ప్రయత్నం చేద్దాం.
కొమ్మాల సంధ్య,
తెలుగు అధ్యాపకురాలు
ప్రభుత్వ జూనియర్ కళాశాల, సమ్మక్క సారక్క తాడువాయి
ములుగు జిల్లా, 9154068272.