Take a fresh look at your lifestyle.

అమరుల ఆత్మ శాంతించింది

పూల్వామా దాడిలో అసువులు బాసిన భారత్‌ జవాన్ల ఆత్మ నేడు శాంతించి ఉంటుంది. పూల్వామాలో పాకిస్తాన్‌ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులు జరిపిన మానవ బాంబు దాడిలో నలభై మంది జవాన్లు నాడు మృతిచెందిన విషయం తెలియంది కాదు. ఈ దాడిపై ఒక్క భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలన్నీ ఆశ్చర్యాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తంచేయడమే కాకుండా ఈ దాడులను తీవ్రంగా ఖండించాయి. ఈ విషయంలో భారత్‌ తీసుకోబోయే చర్యలకు తమ సంపూర్ణ సహకారాన్ని అందిస్తామంటూ ఆయాదేశాలు హామీ ఇచ్చాయి. దీంతో భవిష్యత్‌లో ప్రపంచ రాజకీయాల్లో సంచలనాత్మక మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాకిస్తాన్‌ను ఒంటరి చేయాలన్న భారత్‌ ఆలోచనకు పలు దేశాలనుండి ఇప్పటికే మద్దతు లభిస్తోంది. ఇదిలా ఉంటే నమ్మించి మోసం చేస్తున్న పాకిస్తాన్‌, ఆ దేశం అండదండలతో పెరుగుతున్న ఉగ్రచర్యలపై ఇక ఎంతమాత్రం ఉపేక్షించేదిలేదని భారత సర్కార్‌ నిర్ణయించింది. ప్రపంచ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని భారత సర్కార్‌ ఇంతకాలం ఆచీతూచీ అడుగులు వేస్తూ వచ్చింది. ఇంతకాలంగా శత్రు దేశమైన పాకిస్తాన్‌ చర్యలను స్నేహపూర్వకంగానే నిరోధిస్తూ వచ్చింది. కాని కుంటి ఎద్దు అయినా తన ఎద్దే గెలువాలనుకునే పాకిస్తాన్‌కు ఇవేవీ పట్టేట్లుగాలేవనడానికి పూల్వామా దాడి ప్రత్యక్ష నిదర్శనం. దీంతో భారత సర్కార్‌ తీవ్ర వత్తిడిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా నలభై మంది సైనికులను పోగొట్టుకున్న మరుసటి రోజే మరో సైనికాధికారిని కోల్పోవాల్సి వచ్చింది. ఇక ఎంత మాత్రం ఉపేక్షించే పరిస్థితి లేదనుకున్న భారత్‌ సైన్యానికే సంపూర్ణ అధికారాలను కట్టబెట్టింది. ఇది భారత చరిత్రలో ఒక వినూత్న అధ్యాయానికి తెరదీసింది. ఇంతకు క్రితం కూడా ఒకసారి ఇలాంటి నిర్ణయం తీసుకున్నా, ప్రస్తుత పరిస్థితిలో తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో విశిష్టతను కలిగి ఉంది. సైన్యానికి ఎప్పుడైతే సర్వాధికారాలు అప్పగించారో యుద్ధ రంగంలో తమ సత్తా ఏమిటో భారత సైన్యం పాకిస్తాన్‌కు మరోసారి రుచి చూపింది.గతంలో సర్జికల్‌ దాడిచేసి యావత్‌ ప్రపంచాన్నే విస్మయానికి గురిచేసిన భారత సైన్యం పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోకి చొచ్చుకు పోయి ఉగ్రవాద శిబిరాలపై దాడిచేసి సుమారు మూడువందల మంది ఉగ్రవాదులను మట్టుబెట్టడం ద్వారా పూల్వామా దాడి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల ఆత్మకు శాంతిని చేకూర్చింది భారతసైన్యం. గత సర్జికల్‌దాడి ఎంత విజయవంతమయిందో ఈ ప్రతీకార దాడికూడా అంతే విజయవంతమయింది. లక్ష్యాన్ని చేధించడంలో ఎక్కడా పొరపాటు జరుగకుండా, అనుకున్నది అనుకున్నట్లుగా పనిపూర్తి చేసుకుని సురక్షితంగా తిరిగి వచ్చిన భారత సైన్యాన్ని యావత్‌ భారత్‌ ప్రశంసిస్తోంది. భారత్‌ వాయుసేనకు చెందిన 12 మిరేజ్‌ 2000 జెట్‌ విమానాలు పాక్‌ సరిహద్దుల్లోని ఉగ్రవాద శిబిరాలపై బాంబుల వర్షం కురిపించాయి. సరిహద్దు యాభై కిలోమీటర్ల దూరంలోని ఖైబర్‌ ఫక్తూన్‌ ఖావా ప్రావిన్స్‌లోని బాలకోట్‌, చాకోటి, ముజఫరాబాద్‌ ప్రాంతాల్లో ఉన్న జైషే మహ్మద్‌ ఉగ్రవాద శిబిరాలను ఈ జెట్‌ విమానాలు విధ్వంసంచేయడంతో పాటు, వాటిల్లో తలదాచుకుని ఉన్న ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఇదంతా మంగళవారం తెల్లవారుజామున 3.45 నుండి 4.04 నిమిషాల్లోపు అంటే పందొమ్మిదినుండి ఇరవై నిమిషాల్లో అత్యంత చాకచక్యంగా మన సైనికులు పని ముగించుకుని సరక్షితంగా తిరిగి భారత్‌లోకి చేరుకోవడం నిజంగా ప్రశంసనీయం. బారత్‌ దాడి చేస్తుందని పాకిస్తాన్‌కు తెలిసినా ఈ మెరుపుదాడితో చలించిపోయింది. ఈ దాడులపై దేశ విదేశాల నుంచి భారత్‌కు ప్రశంసలు రావడం విశేషం. ఇప్పటికే అఫ్ఘానిస్తాన్‌ భారత్‌ను ప్రశంసించగా, అమర జవాన్ల కుటుంబాలు కూడా భారత్‌ చర్య పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాయి. దేశంలోని పలువురు వ్యాపారవేత్తలు కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. దేశంలోని సుమారు ఏడు కోట్ల మంది వ్యాపారులు ప్రధాని నరేంద్ర మోదీని, ఎయిర్‌ ఫోర్స్‌ను అభినందించారు. ఇప్పుడు దేశంలో దీపావళి వాతావరణం ఏర్పడిందని, దేశం యావత్‌ భారత్‌కు మద్దతుగా నిలుస్తుందన్నారు. పుల్వామా దాడి తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్‌పైన వివిధ రీతుల్లో చర్యలు తీసుకుంటూనే ఉంది. మోస్ట్‌ ఫేవర్డ్‌ నేషన్‌ జాబితా నుండి పాకిస్తాన్‌ పేరును రద్దు చేయించింది. పాకిస్తాన్‌ నుండి దిగుమతి అయ్యే సరుకులను అడ్డుకునే నేపథ్యంలో వాటిపై 200శాతం సుంకం విధించి ఆర్థికంగా ఆ దేశాన్ని ఇబ్బందులకు గురి చేసే విధంగా చర్యలు తీసుకుంది. పాకిస్తాన్‌ను ప్రపంచ పటంలో ఏకాకిని చేసేందుకు అనేక దేశాలతో చర్చలు జరపడం, మన దేశంనుండి వెళ్ళే నీటిని నిరోధించడం ద్వారా పాక్‌కు నీటి లభ్యత లేకుండా చేయడం లాంటి చర్యలపై గట్టిగా దృష్టిపెట్టింది. అంతటితో ఆగకుండా సైన్యానికే సర్వాధికారాలు ఇవ్వడంతో తాజాగా సర్జికల్‌ 2 సాధ్యమైంది. ఈ దాడిలో మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాదులు మృతిచెందినారని తెలుస్తోంది. ఈ దాడితో పూల్వామా అమరుల అత్మ శాంతిస్తుంది.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy