వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

అప్పుల ఊబిలో రైతులు..?

September 6, 2019

తెలంగాణలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు సీఎం కేసీఆర్‌ ‌ప్రయత్నిస్తున్నారు.వ్యవసాయానికి సాగు నీటి కొరత లేకుండా చూసేందుకు భారీ స్థాయిలో ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు. వ్యవసాయ కూలీలు దొరకని పరిస్థితులు ఉన్న నేపథ్యంలో నరేగాను వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కేంద్రానికి చేసిన విజ్ఞప్తులు కంఠ శోషగా మారాయి. మూస పద్ధతిలో సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయ పంటల సాగును మార్చితే తప్ప రైతులు ఆర్థికంగా బలపడాలని స్వయంగా రైతు అయిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌రైతులకు సూచిస్తున్నారు. క్రాప్‌ ‌ప్యాటర్న్ ‌సిస్టం, క్రాప్‌ ‌కాలనీల ఏర్పాటు ఇంకా కొలిక్కి రాలేదు.దేశంలో వ్యవసాయ వృద్ధి శాతం పెరుగుతున్నప్పటికీ రైతుల ఆర్థికపరమైన స్థితిగతుల్లో ఎలాంటి మార్పు ఉండటం లేదు. ఇది ఆందోళన కలిగించే అంశం. ఆర్థికంగా బాగా ఇబ్బందిపడుతున్న రైతులు తమ భూములను అయినకాడికి అమ్ముకునేందుకు వెనుకాడడం లేడు. కౌన్సిల్‌ ‌ఫర్‌ ‌సోషల్‌ ‌డెవలప్మెంట్‌ ‌రూపొందించిన సామాజిక అభివృద్ధి నివేదిక 2018లో రైతుల ఆర్థిక స్థితిగతులు, ఆత్మహత్యలకు కారణాలను విశ్లేషించింది. 1995 నుంచి 2017 వరకు 22 సంవత్సరాలలో దేశంలో మూడు లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నట్లు నివేదిక వెల్లడించింది. ఆర్థిక అభివృద్ధి, విద్య, వ్యవసాయం, పట్టణీకరణ, వేతనాలు ఇంకా అనేక అంశాలను చాలా మంది సైంటిస్టులు రైతులు ఆర్థికంగా చితికి పోవడానికి కారణాలుగా పేర్కొన్నారు. అలాగే మార్కెటింగ్‌ ‌సౌకర్యాలు సరిగ్గా లేకపోవడం, ధరలకు సంబంధించిన సమాచార వ్యవస్థ లేకపోవడం కూడా రైతులకు నష్టం చేస్తోంది. ఈ-నామ్‌ ‌ద్వారా దేశవ్యాప్తంగా 585 మార్కెట్లను 22వేల గ్రామాలను అనుసంధానం చేశారు. అయితే ఇది సమర్థవంతంగా అమలు అయితేనే రైతులకు ఉపయోగపడే అవకాశం ఉంది. రైతులు ఆర్థికంగా చితికిపోయినప్పుడు ఆదుకునేందుకు ఆదాయ బీమా విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. దిగుబడి హెచ్చుతగ్గుల నుంచి కాపాడేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన ప్రధానమంత్రి ఫసల్‌ ‌బీమా యోజన గురించి రైతులకు ఇప్పటికీ పూర్తి స్థాయి అవగాహన లేకపోవడంతో ఆశించిన ప్రయోజనం లభించడం లేదు. 2015-16 సవత్సరంలో తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ సమయంలో పంటల బీమా 26 శాతం మాత్రమే ఉండడంతో పథకం ఉన్నా ఆదుకొలేని పరిస్ఠితి. గ్రామాన్ని యూనిట్‌గా చేయాలని రైతులు డిమాండ్‌ ‌చేస్తున్నారు. ఇక కనీస మద్దతుధర విధానం కూడా ఆచరణలో రైతులకు ఉపయోగపడడం లేదు. మార్కెట్లకు తరలించడంలో ఉన్న ఇబ్బంది, అయ్యే ఖర్చులను బేరీజు వేసుకుని ఊళ్ళోనే వ్యాపారులకు విక్రయిస్తున్నారు. 24 వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర అమలులో ఉన్నప్పటికీ వరి, గోధుమలకు మాత్రమే ఎంఎస్‌పి సమర్థవంతంగా అమలు అవుతోంది. అయితే అది కూడా కొన్ని ప్రాంతాల్లోని అమలు అవుతుండటం గమనార్హం.
వ్యవసాయ పరిశోధన, విస్తరణ విధానం కూడా పూర్తిగా విఫలమైంది. ప్రాంతాలవారీగా అవసరమైన వంగడాలు, ఎక్కువ దిగుబడిని ఇస్తూ తెగుళ్ళను తట్టుకునే వంగడాలు రైతులకు అందుబాటులో లేవు. వర్షాభావ పరిస్థితులను తట్టుకునే వంగడాలు, భారీ వర్షాలు కురిసినప్పుడు దిగుబడి ఇచ్చే వంగడాలను అభివృద్ధి చేయడం వ్యవసాయ శాస్త్రవేత్తలకు సవాలుగానే మారింది. అధిక దిగుబడిని ఇచ్చే వంగడాలు పరిశోధన కేంద్రాలు దాటి క్షేత్రస్థాయికి చేరకపోవడం కూడా రైతులు ఆశించిన దిగుబడి సాధ్యం కావట్లేదు. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఐసిఎఆర్‌ల మధ్య సమన్వయం లేమి కూడా రైతులకు శాపంగా మారుతోంది. మన దేశంలో పంటల దిగుబడి ప్రపంచ సగటు కంటే తక్కువ. పప్పు ధాన్యాలను తీసుకుంటే, 2012 గణాంకాల ప్రకారం ప్రపంచ పప్పుధాన్యాల సగటు దిగుబడి హెక్టారుకు 3.62 టన్నులు కాగా మనదేశంలో 2.05 టన్నులు మాత్రమే. బీహార్‌ ఒడిశా, జార్ఖండ్‌, ‌మధ్యప్రదేశ్‌, ‌ఛత్తీస్‌ఘడ్‌, ఉత్తరప్రదేశ్‌ ‌రాష్ట్రాలలో జాతీయ సగటు కంటే పప్పు ధాన్యాలు దిగుబడి మరీ తక్కువగా ఉంది. వ్యవసాయ కుటుంబాల్లో మూడింట రెండు వంతుల మందికి పంటల సాగే ప్రధాన ఆదాయ వనరు. కేవలం 4.7 శాతం మందికి మాత్రమే వ్యవసాయేతర రాబడి ఉంది. వ్యవసాయ పెట్టుబడి వ్యయం విపరీతంగా పెరిగింది. దీనికి అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పెరగకపోవడంతో కూడా రైతులకు ఆర్థికంగా సమస్యల్లో కూరుకుపోతున్నారు. దీనికితోడు రాబడి కూడా గణనీయంగా తగ్గింది. అనేక పంటలు సాగు లాభసాటి కాకుండా పోయింది. ఒక వ్యవసాయ కుటుంబం నెలకు సగటు ఆదాయం 6,427 రూపాయలు మాత్రమే. మొత్తంగా చూస్తే వ్యవసాయ కుటుంబాల్లో 33 శాతం మంది పేదరికంలో ఉన్నారు. తెలంగాణలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు సీఎం కేసీఆర్‌ ‌ప్రయత్నిస్తున్నారు. పెట్టుబడి సాయం కోసం రైతుబంధు పథకాన్ని అమలు చేస్తూ విత్తు విత్తే సమయంలోనే రైతులు అప్పులు చేయకుండా ఆపగలిగారు. రైతు బీమా ద్వారా రైతు మృతి చెందితే కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేస్తున్నారు. పంట చేతికి వచ్చేసరికి పడిపోతున్న ధరలను దృష్టిలో పెట్టుకుని ధర వచ్చేంతవరకు పంట ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు కోసం గోదాముల నిల్వ సామర్థ్యాన్ని 4 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల నుండి లక్షల మెట్రిక్‌ ‌టన్నులకు పెంచారు. వ్యవసాయానికి 24 గంటల పాటు కరెంటును సరఫరా చేస్తూ కరెంట్‌ ‌కష్టాలను తొలగించారు. వ్యవసాయానికి సాగు నీటి కొరత లేకుండా చూసేందుకు భారీ స్థాయిలో ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు. వ్యవసాయ కూలీలు దొరకని పరిస్థితులు ఉన్న నేపథ్యంలో నరేగాను వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కేంద్రానికి చేసిన విజ్ఞప్తులు కంఠ శోషగా మారాయి. మూస పద్ధతిలో సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయ పంటల సాగును మార్చితే తప్ప రైతులు ఆర్థికంగా బలపడాలని స్వయంగా రైతు అయిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌రైతులకు సూచిస్తున్నారు. క్రాప్‌ ‌ప్యాటర్న్ ‌సిస్టం, క్రాప్‌ ‌కాలనీల ఏర్పాటు ఇంకా కొలిక్కి రాలేదు. వాతావరణ మార్పులు వల్ల పంటల దిగుబడి గణనీయంగా తగ్గిపోతోంది. పంటలపై చీడ, పీడల తాకిడి ఎక్కువగా ఉంది. కలుపు తీయడం రైతులకు ప్రధాన సమస్యగా మారింది. కూలీల కొరత కారణంగా గ్లైఫోసెట్‌ ‌మందును విచ్చలవిడిగా వాడేస్తున్నారు. ఈ మందు పర్యావరణానికి తీవ్రమైన హాని కలిగిస్తుందని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా రైతులు పట్టించుకోవడం లేదు. వ్యవసాయ అధికారులు రాస్తే తప్ప ఈ మందును విక్రయించడానికి వీల్లేదని ప్రభుత్వం చెప్తున్నా రైతులు పట్టించుకోవడం లేదు. అసలు పురుగు మందుల విక్రయంపై సరైన నిఘా కూడా లేదు. మోతాదుకు మించి పురుగు మందులు పిచికారీ చేస్తున్నారు. ఆ సమయంలో శరీరాన్ని కప్పి ఉంచే విషయమై రైతులకు అవగాహన కూడా లేదు. ఫలితంగా పిచికారీ రసాయనం శరీరంలోకి వెళ్తోంది. రకరకాల అనారోగ్యాలకు రైతులు, కూలీలు గురవుతున్నారు. దీనిపై సమగ్ర అధ్యయనం జరగాలి. యూరియా, కాంప్లెక్స్ ఎరువుల వాడకం తగ్గించాలి. పంటల ఆదాయం తగ్గిపోయిన నేపథ్యంలో పాడి పశువులు రైతులకు ఆర్థికంగా ఉపయోగపడుతున్నాయి. ఇది రైతులకు ఆశాజనకమైన పరిస్థితి. అయితే వ్యవసాయేతర ఆదాయంపై ప్రభుత్వం దృష్టి సారించాలి. రైతుల ఆలోచనా ధోరణి మార్చాల్సి ఉంది. వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు కార్యాలయాలను వీడి పొలాల బాట పట్టాలి. రైతులతో మమేకం కావాలి. క్రాప్‌ ‌లోన్లు సకాలంలో అందించేలా చూడాలి. రుణ మాఫీ చేయడం వల్ల రైతులకు ఉపశమనం కలుగుతోంది. అయితే పంట పెట్టుబడికి అవుతున్న వ్యయానికి రెట్టింపు ఆదాయం వచ్చేలా చూడాలి. అన్నింటికీ మించి వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించడం ద్వారా రైతు చేతికి అందే సొమ్ముకు వినియోగదారుడు వాటిని కొనుగోలు చేస్తున్నప్పుడు చెల్లించే సొమ్ముకు మధ్య వ్యత్యాసాన్ని తగ్గించాలి. మధ్య దలారీ వ్యవస్థను నియంత్రించాలి. రైతుకు మేమున్నాం అనే భరోసాను ప్రభుత్వంతో పాటు ఇతర వర్గాలు కల్పించినప్పుడే రైతుల ఆత్మహత్యలు ఆగుతాయి. రైతు కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడుతాయి.
వంగ మహేందర్‌ ‌రెడ్డి
సీనియర్‌ ‌జర్నలిస్ట్
‌వరంగల్‌
‌సెల్‌ :8096202751