వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

అన్నీ దోపిడీ దొంగ పార్టీలే..!

April 3, 2019

మావోయిస్టు పార్టీ ప్రకటన
త్వరలో జరుగబోయే పార్లమెంటు ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టు పార్టీ పిలపునిచ్చింది. ఈ బూటకపు పార్లమెంటరీ ఎన్నికల చరిత్రలో పీడిత ప్రజల మౌళిక సమస్యలు పరిష్కారం కాలేదని.. అందుకే ఈ ఎన్నికలను బహిష్కరించి నిజమైన ప్రజల రాజకీయాధికారాన్ని స్థాపించుకోవాలని మావోయిస్టు పార్టీ స్పష్టం చేసింది. దీనికి సంబంధించి పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్‌ ఒక ప్రకటనను విడుదల చేశారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌, ‌టీడీపీ, సీపీఐ, సీపీఎం పార్టీలన్నీ సామ్రాజ్యవాద తొత్తులేనని.. ప్రజావ్యతిరేకమైన దోపిడీ దొంగ పార్టీలని మావోయిస్టు పార్టీ పేర్కొంది. 1947 నాటి స్వతంత్ర ప్రకటన ఒట్టి బూటకమైనదని.. ఆనాడు బ్రిటిష్‌ ‌సామ్రాజ్యవాదుల ప్రత్యక్ష వలస, అర్థ భూస్వామ్య స్థానంలో అర్థ భూస్వామ్య, అర్థ వలస వ్యవస్థ ఏర్పడిందని పార్టీ స్పష్టం చేసింది. 2014 ఎన్నికల్లో ఆనాటి యూపీఏ – 2 ప్రభుత్వంపై ఉన్న ప్రజా అసంతృప్తిని, ఆక్రోశాన్ని, వ్యతిరేకతను ఉపయోగించుకొని.. సామ్రాజ్యవాదుల, కార్పొరేట్ల అండదో.. వాగాడంబరంతో ప్రజలకు అనేక వాగ్దానాలు కురిపించి మోడీ నాయకత్వంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్టీయే అధికారంలోని వచ్చిందన్నారు. అయితే ఈ 5 ఏండ్లలో అది ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ప్రజలపై దోపడీ పీడనలను తీవ్రతరం చేసిందని విమర్శించింది. అమెరికా సామ్రాజ్యవాదంతో మిలాఖత్‌ అయి.. వారి దోపిడీ ప్రభుత్వ విధానాల వల్ల రూపాయి విలువ దిగజారిపోయిందని.. తద్వారా డాలరుకు 73 రూపాయలకు చేరుకుందని పార్టీ దుయ్యబట్టింది. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ, పెట్రోల్‌ ‌ధరల పెంపు, వ్యవసాయ సంక్షోభం కారణంగా ప్రజానికం తీవ్ర ఇబ్బందులు పడ్డారని.. విదేశాల నుంచి అక్రమ ధనం తేకపోగా 2 కోట్ల మందికి ఉద్యోగాలే లేకుండా చేశారని మావోయిస్టు పార్టీ ఆ ప్రకటనలో పేర్కొంది. ఇలాంటి సామ్రాజ్యవాద తొత్తు పార్టీలు జరిపే బూటకపు పార్లమెంటు ఎన్నికలను బహిష్కరించి ప్రజలకు నూతన ప్రజాస్వామ్యాన్ని అందించే విప్లవాన్ని విజయవంతం చేయాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది.