Take a fresh look at your lifestyle.

అణచివేత పట్టుదలను పెంచింది

1968లోనే ఉభయ శాసన సభల సంయుక్త సమావేశంలో రాష్ట్ర గవర్నర్‌ ‌చేసిన ప్రసంగంలోనేమి, సభ ముందుకు వచ్చిన రాష్ట్ర బడ్జెట్‌లో నేమీ, ఆంధ్ర ప్రాంతంలో ఖర్చయిన మిగులు నిధులు కొంత మేరకు ప్రభుత్వం అంగీకరించింది. కాని ఆ మేరకైనను ఆ నిధులు తెలంగాణకు తిరిగి చెల్లించే చర్యలు ప్రభుత్వం ఏమీ తీసుకొనలేదు. పైగా ఆంధ్ర నాయకుల కుహనా విధానం వల్ల మిగులు నిధులు లెక్కలు కట్టడంలో తరువాత అనేక చిక్కులు ఉత్పన్నం అయాయి.

ఈ సందర్భంలో తమ బాధ్యతను గుర్తించిన పలువురు తెలంగాణా నాయకులు, ఆంధ్ర ప్రాంతంలో ఖర్చయిన తెలంగాణ మిగులు నిధులు మొత్తం ఎంతో తేల్చవలసినదిగా పదేపదే ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. అయితే ఆయన ఎప్పటి కప్పుడు ఏవో కల్లబొల్లి కబుర్లు చెప్పి ఏదో అంకెలు చెప్పి తప్పించుకోవడం తప్ప ఖచ్చితమైన చర్యలు ఏమీ తీసుకొనలేకపోయారు.

తెలంగాణ ప్రజా పోరాటానికి రక్షణల ఉద్యమం పేరుతో ఖమ్మం జిల్లా పాల్వంచ థర్మల్‌ ‌విద్యుచ్ఛక్తి కేంద్రంలో అంకురార్పణ జరిగింది. క్రమంగా జనవరి రెండవ వారంలో ఈ ఉద్యమం కొంత ఉధృత రూపం ధరించింది. ఖమ్మంలో రవీంద్రనాథ్‌ అనే ఒక విద్యార్థి నిరవధిక నిరాహార దీక్ష పూని అందరీ దృష్టిని ఆకర్షించగలిగాడు. శ్రీ రవీంద్రనాథ్‌కు, ఆనాడు బ్రహ్మానందరెడ్డి రాజకీయ ప్రత్యర్థి శ్రీ జలగం వెంగళరావు పరోక్ష మద్దతు లభించింది. మరొక అసమ్మతి నాయకుడు ఏసి సుబ్బారెడ్డితో జట్టుకట్టిన వెంగళరావు సంజీవరెడ్డి వర్గంలో చేరడం జీర్ణించుకొనలేకపోయిన బ్రహ్మానందరెడ్డి ఆయనను రాష్ట్ర పంచాయితీరాజ్‌ ‌మండలి అధ్యక్ష పదవి నుండి తొలగించారు. వెంగళరావు కోర్టును ఆశ్రయించి ప్రభుత్వ ఉత్తర్వులు రద్దు చేయించారు. ఆ తర్వాత సంజీవరెడ్డి – బ్రహ్మానందరెడ్డి వర్గాల మధ్య హోరాహోరి పోరు జరిగి, రాష్ట్ర కాంగ్రెస్‌ ఎన్నికల సంఘంలో 11వ స్థానానికి జరిగిన ఎన్నికలో బ్రహ్మానందరెడ్డి వర్గ అభ్యర్థి నెగ్గడం జరిగింది. వెంగళరావు – బ్రహ్మానందరెడ్డి ప్రత్యర్థిగానే మిగిలారు. అదీ పూర్వరంగం.

ఖమ్మం జిల్లా ఇల్లెందు పట్టణ వాస్తవ్యుడు శ్రీ రామదాసు అనే యువకుడు పాల్వంచ థర్మల్‌ ‌కేంద్రం జరిగిన అన్యాయాలను మొదట వెలుగులోకి తెచ్చి, అక్కడ ఉద్యమ ప్రారంభానికి 1968 సంవత్సరంలోనే అంకురార్పణ చేశారు. యన్‌.‌జి.వో నాయకుడు డి. పురుషోత్తం తదితరులు, రామదాసు తెలంగాణలో పెక్కు జిల్లాలు నిద్రాహారలు లేకుండా పర్యటించి ఉద్యోగస్తులు, యువకులకు జరిగిన అన్యాయాల గురించి ఎంతో భోగట్టా సమీకరించి, మొదట రక్షణల అమలు ఉద్యమానికి, తర్వాత ప్రత్యేక రాష్ట్ర పోరాటానికి ఎందరినో సమాయత్తం చేశారు. రామదాసుపై పోలీసులు ఎన్నో కేసులు పెట్టి, దౌర్జన్యం చేసి అనేక హింసలకు గురిచేశారు. అయినా అతని పట్టుదల సన్నగిల్లలేదు. రబ్బరు బంతిని ఎంత గట్టిగా కొడితే అంతపైకి లేచినట్టు ప్రభుత్వ ప్రతి అణచివేత చర్య ప్రజ)లో ద్విగుణీకృత పట్టుదలను కలుగజేసింది.

– ఆదిరాజు వెంకటేశ్వరరావు

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy