వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

అడవులు, నీళ్లను ఎక్కడి నుంచి తెస్తాం..!

September 13, 2019

న్యూక్లియర్‌ ‌పవర్‌ అవసరమనుకుంటే యురేనియం దిగుమతి చేసుకోవచ్చు..
పిసిసి నల్లమల వ్యతిరేక పోరాట కమిటీ
విహెచ్‌ అధ్యక్షతన ఏర్పాటు
16న అఖిలపక్ష భేటీ ఉంటుందన్న విహెచ్‌
నల్లమల అటవీ ప్రాంత పరిరక్షణ, యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా టీపీసీసీ ఓ కమిటీని నియమించింది. 16 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీకి చైర్మన్‌గా రాజ్యసభ మాజీ ఎంపీ వీహెచ్‌ను పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి నియమించారు. ఈ సందర్భంగా వీహెచ్‌ ‌మాట్లాడుతూ.. ఈ నెల 16న యురేనియం వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. యురేనియం తవ్వకాలపై త్వరలో ప్రజల్లోకి వెళ్తామన్నారు. కృష్ణా పరివాహక
ప్రాంతం విషతుల్యం కాకుండా కాపాడుకోవలసిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. న్యూక్లియర్‌ ‌పవర్‌ అవసరమనుకుంటే యురేనియం దిగుమతి చేసుకోవచ్చని…కానీ అడవులు, నీళ్లను ఎక్కడి నుంచి తెచ్చుకోగలమని వీహెచ్‌ ‌ప్రశ్నించారు. నల్లమలను విషతుల్యం చేయకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. తమ పోరాటానికి ప్రతి ఒక్కరూ కదలాలని అన్నారు. ఇదిలావుంటే సేవ్‌ ‌నల్లమల ఉద్యమానికి సినీ దర్శకుడు, సామాజికవేత్త డాక్టర్‌ ఆనంద్‌ ‌మద్దతు పలికారు. బాలికా విద్య, కుల వివక్ష, మహిళా సాధికారత వంటి సామాజిక అంశాలపై తనవంతు కార్యక్రమాలను, పేదలకు ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్న ఆయన.. నల్లమల ఉద్యమంలో తానూ భాగస్వామినని తెలిపారు. సామాజిక మాధ్యమాల ద్వారా అలాగే అరవింద్‌ ‌మిత్రబృందంతో కలిసి ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్నామని ఆయన అన్నారు. నల్లమలలో యురేనియం తవ్వకాలు జరిగితే, కృష్ణానది కలుషితం అవుతుందని, అనేక వన్య ప్రాణులు కనుమరుగు అవుతాయని, చెంచుల జీవనం అస్తవ్యస్తమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇరవై వేల ఎకరాలు ధ్వంసమయ్యే ఆస్కారం ఉందని, తాగడానికి నీరు, పీల్చడానికి గాలి లేనప్పుడు, యురేనియాన్ని, విద్యుత్తును ఏం చేసుకుంటామని ప్రశ్నించారు. సమస్త జీవకోటిని బలి తీసుకునే యురేనియం మైనింగ్‌ను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. సేవ్‌ ‌నల్లమల ఉద్యమానికి ఇప్పటికే జనసేన అధినేత పవన్‌ ‌కల్యాణ్‌, ‌సినీ ప్రముఖులు శేఖర్‌ ‌కమ్ముల, ఆర్పీ పట్నాయక్‌, ‌విజయ్‌ ‌దేవరకొండ, బ్యాడ్మింటన్‌ ‌క్రీడాకారిణి జ్వాలా గుత్తా, రచయిత గోరేటి వెంకన్న తదితరులు తమ మద్దతు తెలిపారు.